ఇది మీ బాదుడే కదా జగన్..!
ABN, Publish Date - Dec 28 , 2024 | 12:57 AM
గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లుల షాక్ అదనపు ఛార్జీల వడ్డనతో జనానికి వైసీపీ చుక్కలు
తిరుపతి, ఆంధ్రజ్యోతి: విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన చేయడమా..? ఇదీ జనం, కూటమి నేతల ప్రశ్న. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పెంచిన కరెంటు భారాన్ని గుర్తుచేస్తున్నారు. యూనిట్ రూ.5కు దొరికే విద్యుత్‌కు బదులు రూ.8నుంచి రూ.14 వరకు కొనుగోలు చేసి ప్రజలపై జగన్ మోయలేని భారమేశారని మండిపడుతున్నారు. గత ఐదేళ్లూ కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉన్నాయని వినియోగదారులను గగ్గోలు పెట్టించారు. తొమ్మిదిసార్లు ధరలు పెంచుకుంటూ పోయి సామాన్య, మధ్యతరగతి ప్రజలు కరెంట్ స్విచ్ వేయాలంటేనే భయపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం నుంచి జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు గత వైసీపీ పాలకులు చుక్కలు చూపించారు. అందుకే ఎన్నికల ఫలితాలతో వినియోగదారులు తిరిగి వాళ్లకు షాక్ ఇచ్చారు. గతంలో ఎప్పుడో వాడిన విద్యుత్తుకు ట్రూ అప్ ఛార్జీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసింది. సర్దుబాటు రుసుం, సర్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు.. ఇలా పేరు ఏదైనా వినియోగదారులపైనే ఆ భారం పడింది. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను పూడ్చుకునేందుకు ట్రూఅప్ ఛార్జీల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా బాదేసింది. ఎప్పుడో, ఎవరో వాడిన బిల్లులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తోందని వినియోగదారులు మండిపడ్డారు. ఇవికాకుండా బిల్లు వచ్చిన 14 రోజుల్లోపు చెల్లింపులు జరగకపోతే సర్‌ఛార్జ్, ఇంధన ఛార్జ్, జరిమానా రూపంలో పిండేశారు. ఒక విద్యుత్ సర్వీ్‌సకు రూ.100 బిల్లు వస్తే, గడువు తీరిన వారంలోపు చెల్లించకపోతే రూ.135, వారంలోపు కూడా చెల్లించకపోతే మరో రూ.50.. ఆలస్య రుసుంతో రూ.185 చెల్లించాల్సి వచ్చింది. అంటే రూ.100 బిల్లుకు ఆలస్యం కారణంగా అదనంగా రూ85లు కట్టాల్సివచ్చింది.
ఇదీ వైసీపీ బాదుడు
ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, కడప, నెల్లూరు. కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో పెంచిన ట్రూ అప్ చార్జీలు మొత్తం రూ.6414 కోట్లు ఉండగా, వార్షిక ఆదాయ సర్దుబాటు ఛార్జీల రూపంలో రూ.878 కోట్లు వినియోగదారులపై భారం వేశారు.
సంవత్సరం ట్రూఅ్‌ప ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు
2021-22 రూ.1392 కోట్లు రూ.591.45 కోట్లు
2022-23 2398 కోట్లు 60.84 కోట్లు
2023-24 2624 కోట్లు 224.93 కోట్లు
మొత్తం రూ.6414కోట్లు రూ.876.93 కోట్లు
Updated Date - Dec 28 , 2024 | 12:57 AM