నారావారిపల్లి రూపుమారుతోంది..!
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:16 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి రూపురేఖలు మరో ఆరు నెలల్లో మారనున్నాయి. కుప్పం తరహాలో నారావారిపల్లికి కూడా ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు.
మొదలైన ఇంటింటి సర్వే... ప్రత్యేకాధికారిగా డీపీవో
విద్య, నైపుణ్యాలు, వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణలకు ప్రాధాన్యం
సొంత ఊరి అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం
తిరుపతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి రూపురేఖలు మరో ఆరు నెలల్లో మారనున్నాయి. కుప్పం తరహాలో నారావారిపల్లికి కూడా ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. చంద్రబాబు తన సొంత ఊరి అభివృద్ధిపై దృష్టి సారించిన నేపథ్యంలో సీఎంఓ దిశా నిర్దేశంతో జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులేస్తోంది. ఇటీవల సోదరుడి అంత్యక్రియలు, కర్మక్రియల కోసం గ్రామంలో కొన్ని రోజులు గడిపిన నేపథ్యంలో ఆయన తన ఆలోచనలను కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పంచుకున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రోడ్డు కనెక్టివిటీ, టీటీడీ కల్యాణ మండపం, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఆస్పత్రి వంటివి తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సొంత ఊరిని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించాలని తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంతో ముడిపడివున్న రంగంపేట, కందులవారిపల్లి, చిన్న రామాపురం సచివాలయాల పరిధిని ఎంచుకున్నారు. ఈ మూడు సచివాలయాల పరిధిలోని కుటుంబాల సమగ్ర వివరాలూ సేకరించనున్నారు. దానికోసం ‘‘ఒక కుటుంబం...ఒక వ్యవస్థాపక వ్యాపారవేత్త’’ (ఒన్ ఫ్యామిలీ - ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్) అనే నినాదంతో ఇంటింటి సర్వే మొదలైంది. అవసరాలేమిటన్నది లోతుగా ఆరా తీస్తున్నారు.
చదువు, నైపుణ్యాల పెంపుపై ప్రధాన దృష్టి
పది ప్రాఽథమిక పాఠశాలలను బలోపేతం చేయనున్నారు. అంగన్‌వాడీ నుంచీ మూడవ తరగతి వరకూ నాణ్యమైన విద్యను ఆపై టెన్త్ వరకూ సమగ్ర విద్యను పిల్లలకు అందించనున్నారు. ఆ ప్రాంతంలోని ఏకైక జడ్పీ హైస్కూలును శ్రీసిటీ దత్తత తీసుకోనుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఆ స్కూల్‌ను రాష్ట్ర స్థాయిలో ఆధునిక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనుంది. నైపుణ్యాలు అవసరమైన వారికి కొత్తగా శిక్షణ, ఇప్పటికే శిక్షణ పొందిన వారికి ఉన్నత శిక్షణ, శిక్షణ పొంది మరచిపోయిన వారికి తిరిగి శిక్షణ ఇప్పించనున్నారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మిగిలిన వారికి స్థానికంగానే వివిధ రకాలైన అంశాల్లో శిక్షణ ఇచ్చి వస్తు ఉత్పత్తికి అవకాశం కల్పిస్తారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా రైతులకు అవసరమైన సాయం అందించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, డీఆర్‌డీఏ ద్వారా స్వయం ఉపాధికి యూనిట్లు వంటివి అందించనున్నారు.
ఆధునిక వసతుల కల్పనపైనా దృష్టి
ఇన్‌డోర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం గుర్తించారు. నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అక్కడే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సీడీఎం సదుపాయం ఉన్న ఏటీఎం ఏర్పాటు కానుంది. చిన్న రామాపురం పంచాయతీలో బీఎ్‌సఎన్‌ఎల్ ఇంటర్నెట్ క్వాలిటీ పెంచనున్నారు. ఈ-ఆటోలు, ఈ-బస్సు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోపు అందుబాటులోకి రానున్నాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.41 లక్షలతో 11 తాగునీటి పథకాలు, రూ.81 లక్షలతో ఐదు సీసీ రోడ్లు మంజూరయ్యాయి. రూ.21 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి కానున్నాయి. ఐతేపల్లి నుంచీ రంగంపేట వరకూ రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా అటు నాయుడుపేట-పూతలపట్టు ఆరు వరుసల జాతీయ రహదారి నుంచీ ఇటు మదనపల్లె-తిరుపతి నాలుగు వరుసల జాతీయ రహదారిని కలపనున్నారు.
నారావారిపల్లి అభివృద్ధికి వేగంగా చర్యలు: కలెక్టర్
ఇంటింటి సర్వే ఈ నెలాఖరుకు ముగియనుంది. ఇప్పటికే పాఠశాల అభివృద్ధికి రూ.80 లక్షలతో అంచనాలు రూపొందించి శ్రీసిటీకి అందజేశాం. నైపుణ్యాల శిక్షణ పరంగా ప్రస్తుతానికి 1800 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన రెండు భవనాలను గుర్తించి సిద్ధం చేశాం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాం. నైపుణ్యాల శిక్షణ పేరిట నామమాత్రపు చర్యలకు పరిమితం కావడం లేదు. అర్హత ఉన్న వారికి ఎలకా్ట్రనిక్స్, ఎయిర్ కండిషనింగ్, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్ పైనా దృష్టి పెడుతున్నాం. నారావారిపల్లి పరిధిలో ప్రతి ఇంటి నుంచీ ఒక వ్యవస్థాపక వ్యాపారవేత్త తయారై మంచి ఆదాయం సంపాదించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నాం.
Updated Date - Dec 22 , 2024 | 02:16 AM