సారా నిర్మూలనకు త్వరలో నవోదయం 2.0 ప్రారంభం
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:11 AM
సారాను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రభుత్వం మళ్లీ నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చిత్తూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసాచారి తెలిపారు.
ఎక్సైజ్ ఏసీ శ్రీనివాసాచారి
పుంగనూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సారాను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రభుత్వం మళ్లీ నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చిత్తూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసాచారి తెలిపారు. పుంగనూరు మండలం నల్లగుట్టపల్లె తాండా సమీపంలో సారా తయారీ బట్టీలను శనివారం ఆయన ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖకు మూడునెలల్లో రాష్ట్రాన్ని సారారహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని, ఆ దిశగా ఈనెల 16వ తేది నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా తమ బృందాలతో నాటు సారాపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. సారా తయారీ, విక్రయాలతో జీవనం సాగించేవారు ఇకపై ఆ పనులు మానుకోవాలని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయంగా గొర్రెలు, ఆవులు పట్టించి ఇవ్వడం, దుకాణాలు, తదితర పనులతో ఉపాధి పొందేలా బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామన్నారు. సారా తయారీ, రవాణా, విక్రయాలు కొనసాగించే వారిపై ఇక కఠిన చర్యలు ఉంటాయని, తొలుత తహసీల్దారు వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేయిస్తామని తెలిపారు. తర్వాత ఏడాది పాటు బెయిల్ రాకుండా పీడీ యాక్టు పెడతామన్నారు.సారా కేసుల్లో నిందితులకు ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాలన్నీ ఆగిపోతాయని వివరించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చీకలబైలు ,చిత్తూరు జిల్లా వి.కోట, తమిళనాడు సరిహద్దులోని నరహరిపేట వద్ద చెక్‌పోస్టులు నడుస్తాయని, బయటరాష్ట్రాల మద్యం రాకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.చిత్తూరు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాస్, ఏఈఎ్‌సలు కృష్ణకిశోర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, కె.సురేశ్‌రెడ్డి, డీపీఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 02:11 AM