మరోసారి పక్షుల పండుగ తేదీల మార్పు!
ABN, Publish Date - Dec 30 , 2024 | 01:20 AM
పక్షుల పండుగ తేదీలు మరోసారి మారే సూచనలు కనబడుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత సూళ్లూరుపేట కేంద్రంగా పక్షుల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
తడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పక్షుల పండుగ తేదీలు మరోసారి మారే సూచనలు కనబడుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత సూళ్లూరుపేట కేంద్రంగా పక్షుల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి మౌళిక ఆదేశాలు జిల్లా అధికార యంత్రాంగంకు అందాయి. మొదట పక్షుల పండుగను జనవరి 10, 11, 12 తేదీలలో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. సమయం తక్కువగా ఉండటంతో ఆ తేదీలను జనవరి 17, 18, 19 తేదీలకు మార్చారు. ఆమేరకు అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగ, నాయుడుపేటలో మూడు రోజులపాటు ఏటి పండుగ అవే రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆ తేదీలను మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు తేదీల మార్పును సూచించినట్లుగా తెలుస్తుంది. పండగ తేదీలలో పాఠశాలలకు సెలవుదినాలు కావడంతో ఊర్లకు వెళ్లిన విద్యార్థులు పక్షుల పండుగను వీక్షించే అవకాశం ఉండదు. ఈ క్రమంలో తేదీల మార్పును ప్రతిపాదించామని, అందరికీ అనుకూలమైన తేదీలలోనే పక్షుల పండుగ నిర్వహిస్తామని ఆదివారం ఎమ్మెల్యే విజయశ్రీ మీడియాకు తెలిపారు.
Updated Date - Dec 30 , 2024 | 01:20 AM