మహిళల వెన్నుతట్టి..అసహాయులకు చేయూతనిచ్చి!
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:35 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో జరిపిన నాలుగు రోజుల పర్యటన విజయవంతమైంది.
కుప్పం అభివృద్ధికి భువనేశ్వరి హమీ
విజయవంతంగా ముగిసిన పర్యటన
కుప్పం, డిసెంబరు 22 (ఆంద్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో జరిపిన నాలుగు రోజుల పర్యటన విజయవంతమైంది. ఈనెల 19వ తేదీన శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మమేకమై, గుడుపల్లె మండలం నలగాంపల్లెలో మహిళలతో ముఖాముఖితో ప్రారంభమైన భువనేశ్వరి పర్యటన, కుప్పం , రామకుప్పం, శాంతిపురం మండలాలమీదుగా సాగి, ఆదివారంనాడు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో మహిళలతో ముఖాముఖితో ముగిసింది. ఇక్కడినుంచి పలమనేరు నియోజకవర్గం వి.కోటకు చేరుకుని, అక్కడ ఎన్టీఆర్ సుజల ప్లాంటు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నాక, బెంగళూరుకు అక్కడినుంచి హైదరాబాదుకు పయనమై వెళ్లారు.
ముఖ్యమంత్రి సతీమణిగానో లేదా రాజకీయంగానో తాను ఇక్కడికి రాలేదన్న భువనేశ్వరి తొలుత చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. కుప్పంలో ట్రస్టు తరఫున నడుస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను విస్తరించారు. దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు వితరణ చేశారు. ఇంకా ట్రస్టు కార్యక్రమాలను విస్తరిస్తామని, కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక అక్కడినుంచి నాలుగు మండలాలతోపాటు కుప్పం మున్సిపాలిటీలో కూడా మహిళలతోను, డ్వాక్రా సంఘాలతోను ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సాదకబాధకాలు విని, తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున హామీ ఇచ్చారు. కేవలం కుప్పం నియోజకవర్గంలోనే ఏకంగా 40 రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన సాగించి, నియోజకవర్గ ప్రజలను దోచి తమ జేబులు నింపుకున్నదని విమర్శలు చేయడమే కాదు, వచ్చే అయిదేళ్లలో అంతకంతా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
మహిళా శక్తిని ప్రవచించి
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో కుప్పంలో జరిగిన అభివృద్ధి, ఇక మీదట జరగబోయే అభివృద్ధిని ప్రస్తావిస్తూనే, భువనేశ్వరి తన ప్రసంగంలో ఎక్కువగా మహిళలను ఉత్తేజితం చేశారు. ఎవరిలోని శక్తి వారే గుర్తించాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని వెన్ను తట్టారు.ప్రభుత్వం తరఫున, ఎన్టీఆర్ ట్రస్టు తరఫున కూడా మహిళలకు మరింత చేయూత లభిస్తుందని భరోసా ఇచ్చారు.కాబట్టే భువనేశ్వరికి అడుగడుగునా మహిళలనుంచి ఘన నీరాజనాలు లభించాయి.కుప్పానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఆమెపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తింది. భువనేశ్వరి కూడా నియోజకవర్గ స్థాయిలోని అగ్ర నాయకత్వానికంటే ఎక్కువగా మహిళలకే తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో ఆదివారం జరిగిన సభలో అయితే వేదిక మీద మొత్తం మహిళలే నిండిపోయారు. ఇలా మహిళలు ముందుకు వచ్చి జీవితాల్లో విజయాలు సాధించాలని భువనేశ్వరి వారికి పిలుపునిచ్చారు. ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్.మునిరత్నం, టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు, ఆయా మండలాల టీడీపీ అద్యక్షులు, తెలుగు మహిళలు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 01:35 AM