Police: ప్రయాణికులకు పోలీసుల ‘దండం’
ABN, Publish Date - Oct 12 , 2024 | 01:31 AM
వాహనంలో కిక్కిరిసిపోయి ఉన్న జనం భయం భయంగా చూస్తుండగా ఎస్‌ఐ, కానిస్టేబుల్.. రెండు చేతులూ జోడించారు.
వెదురుకుప్పం, అక్టోబరు 11 : పోలీసులు చెయ్యెత్తి ఆపగానే ఆ లగేజీ ట్రక్కు లో ప్రయాణిస్తున్నవారికి గుండెలు అదిరిపోయాయి. డ్రైవర్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. పైగా ఆపింది ఎస్‌ఐ. కోటింగ్ తప్పదనుకున్నారు. ఆగిన వాహనంలో కిక్కిరిసిపోయి ఉన్న జనం భయం భయంగా చూస్తుండగా ఎస్‌ఐ, కానిస్టేబుల్.. రెండు చేతులూ జోడించారు.ఇటువంటి ప్రయాణాలు ప్రాణాలు తీస్తాయనీ, కుటుంబాలు కన్నీటిపాలు అవుతాయనీ వివరించారు. ఇంటి దగ్గర వారికోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను తలచుకుని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండంటూ ప్రాధేయపడ్డారు. మరోసారి ఇలా లగేజీ వాహనంలో ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని డ్రైవర్‌ను హెచ్చరించారు. చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి కొల్లాగుంట చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఈ దృశ్యం అక్కడివారినంతా ఆశ్చర్యపరిచింది. వాహనాలను కానిస్టేబుల్‌తో కలిసి తనిఖీ చేస్తున్న కార్వేటినగరం ఎస్‌ఐ రాజ్‌కుమార్ ఇలా వ్యవహరించారు. ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు.
Updated Date - Oct 12 , 2024 | 01:31 AM