TTD: అన్యమతస్థ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
ABN, Publish Date - Feb 02 , 2024 | 10:53 AM
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో వెంకన్న సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. హిందూ భక్తులతో పాటు అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు.
తిరుమల, ఫిబ్రవరి 2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో వెంకన్న సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. హిందూ భక్తులతో పాటు అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే దీనికి ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తిరుమలకు వచ్చే హిందూయేతరులు.. ‘‘మాకు శ్రీవారిపై సంపూర్ణ నమ్మకం ఉంది’’ అంటూ డిక్లరేషన్ సమర్పించి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవలో పాల్గొంటామంటూ ఇటీవల అన్యమతస్థ భక్తుల నుంచి టీటీడీకి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. వెంకన్న సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందూయేతర భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అన్యమతస్థ భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది.
త్వరలోనే అనుమతి...
త్వరలోనే ఆఫ్‌లైన్‌లో అన్యమతస్థ భక్తులను శ్రీవారి సేవకు అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharmareddy) ప్రకటించారు. వారిని శ్రీనివాసుడి దర్శనానికి అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సెక్యూరిటీ విభాగం సూచనల మేరకు హిందూయేతరులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా మంది ఇతర మతస్థులు వెంకన్నకు సేవ చేసేందుకు అనుమతివ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఓ కమిటీని నియమించి వారీ సూచనల మేరకు అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు.
జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నూతనంగా క్యూ కాంప్లెక్స్‌లను నిర్మించామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండకుండా స్లాట్ ద్వారా భక్తులకు దర్శనం టోకెన్లను జారీ చేస్తామని చెప్పారు. జనవరి మాసంలో 21 లక్షల 09 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. హుండీ ద్వారా రూ. 116.46 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. కోటి 3 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని.. 46 లక్షల 46 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. 7 లక్షల 5వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారన్నారు. రేపటి (శనివారం) నుంచి మూడు రోజుల పాటు ధార్మిక సదస్సుని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 02 , 2024 | 12:20 PM