సిఫార్సులున్నా గంటల తరబడి నిరీక్షణ
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:25 AM
తెనాలికి చెందిన శ్రీనివాస్ మధ్యతరగతికి చెందిన వ్యక్తి. తిరుమలలో గది కోసం రెండు నెలల పాటు ఓ నాయకుడి చుట్టూ తిరిగి ఎట్టకేలకు సిఫార్సు లేఖ పొందారు.
గదుల కోసం పద్మావతి, ఎంబీసీ వద్ద పడిగాపులు
తిరుమల, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): తెనాలికి చెందిన శ్రీనివాస్ మధ్యతరగతికి చెందిన వ్యక్తి. తిరుమలలో గది కోసం రెండు నెలల పాటు ఓ నాయకుడి చుట్టూ తిరిగి ఎట్టకేలకు సిఫార్సు లేఖ పొందారు. ‘హమ్మయ్యా గదికి సమస్య లేదులే’ అనుకుని తిరుమల చేరుకున్నారు. ఎంబీసీ34లో గది పొందాలని సూచన చేయడంతో ఉదయం 10 గంటలకు క్యూలైన్‌లోకి వెళ్లిన ఆయనకు.. మఽధ్యాహ్నం 3 గంటలైనా గది లభించలేదు. విజయవాడకు చెందిన మరో భక్తుడు కూడా ఇలానే దాదాపు ఐదు గంటలు నిలబడ్డారు. ఇక పద్మావతి విశ్రాంతి గృహంలోనూ ఉదయం క్యూలైన్‌లోకి వెళ్లే వారికి మధ్యాహ్నమైనా గదులు దొరకలేదు. తిరుమలలో సాధారణంగా ఎలాంటి సిఫార్సుల్లేని భక్తులు సీఆర్వోలో గదులు పొందుతారు. ఇక రాజకీయ, వివిధ రాజ్యాంగహోదాలో ఉన్నవారైతే నేరుగా గదులు, దర్శనాలు పొందుతున్నారు. క్యూలైన్‌లో నిలబడలేక, హైలెవల్‌లో సౌకర్యాలు పొందలేక ఏదో తమకు తెలిసినవారి ద్వారా సిఫార్సు లేఖలు తీసుకొచ్చే మధ్య తరగతి భక్తులు మాత్రం అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సిఫార్సు లేఖలపై గదులు కేటాయించే పద్మావతి, ఎంబీసీ34 వద్ద భక్తులు గదుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సివస్తోంది. పిల్లలు, వృద్ధులు, లగేజీలతో ఈరెండు కౌంటర్ల వద్ద తిండితిప్పలు లేకుండా నిరీక్షిస్తున్నారు. దాదాపు పద్మావతి, ఎంబీసీ పరిధిల్లో దాదాపు 1,600 గదులు అందుబాటులోకి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్వహణ లోపంతో భక్తులు గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల దర్శన టికెట్లు ఉన్నవారికే గదులు అనే విధానాన్ని అమలుచేయడంతో వారం పదిరోజుల పాటు గదులన్నీ మిగిలిపోయాయి. ఆ తర్వాత ఉన్నతాధికారుల మందలింపుతో తిరిగి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇలా రిసెప్షన్ విభాగంలో సరైన నిర్వహణ లేకపోవడంతో వసతి విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వసతి కల్పనపై దృష్టిసారించాల్సి ఉంది.
Updated Date - Dec 23 , 2024 | 01:25 AM