AP CM Chandrababu : మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:12 AM
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామని, కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు.
ఇమామ్, మౌజన్లకు గౌరవ వేత వాలకు ఆదేశాలు ఇచ్చాం: సీఎం
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామని, కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కలెక్టర్ల సదస్సు చివరిరోజు గురువారం మైనారిటీ సంక్షేమశాఖపై సీఎం సమీక్ష జరిపారు. పీఎం జన్‌వికాస్ కార్యక్రమం కింద రూ.643 కోట్లతో 8,033 పనులు చేపట్టేందుకు అనుమతులు లభించాయని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి హర్షవర్థన్ తెలిపారు. అందులో రూ.252 కోట్లతో 100 పనులకు అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో మైనారిటీ పథకాల అమలుకు రూ.104 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. నేషనల్ మైనార్టీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నుంచి రూ.300 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, అందుకుగాను కౌంటర్ గ్యారంటీ అడుగుతున్నారని తెలిపారు. మైనారిటీ సంస్థల నిర్మాణానికి భూములు కేటాయింపుపై కలెక్టర్లకు డైరెక్షన్ ఇచ్చామన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తున్నామన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్‌కు రూ. 8.86 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మైనారిటీ విద్య విషయంలో చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సలహదారు షరీఫ్ కోరారు. ‘‘చాలీచాలని గదుల్లో మైనారిటీ రెసిడెన్సియల్ స్కూళ్లు నడుస్తున్నాయి. అనంతపురంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గుంతకల్లు, ఆదోనీల్లో బిల్డింగ్‌లు కట్టారు. కానీ, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది లేరు’’ అని వివరించారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని... అధికారుల దృష్టికి మంత్రి ఫరూక్ తెచ్చారు.
Updated Date - Dec 13 , 2024 | 05:12 AM