డేటా అనుసంధానంతో మెరుగైన పౌర సేవలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:16 AM
రాష్ట్ర పౌరులందరి సమగ్ర సమాచారాన్ని అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా మెరుగైన సేవలు అందించాలని ఆర్‌టీజీఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అన్ని శాఖల సమాచారం ఒకే ప్లాట్‌ఫాం మీదకు
ఆర్‌టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
నెలాఖరులోగా వాట్సప్ ద్వారా 100 పౌర సేవలు: మంత్రి లోకేశ్
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరులందరి సమగ్ర సమాచారాన్ని అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా మెరుగైన సేవలు అందించాలని ఆర్‌టీజీఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే పుట్టిన ప్రతిబిడ్డకూ ఆధార్ అందించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి అవసరమైన విధానాలపై కసరత్తు చేయాలని సూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రియల్ టైమ్ గవరెన్స్‌పై ఐటీ, మానవ వనరులు, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి ఆయన సమీక్షించారు. ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రధాన డేటా వనరుగా ఉండాలని, అన్ని శాఖల సమాచారాన్ని ఒకే ప్లాట్‌ఫాం మీదకు తీసుకువచ్చి అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డేటా ద్వారా నిరంతరం విశ్లేషించాలని సూచించారు. జనన, మరణ, నివాసం, ఆదాయం, విద్యార్హత వంటి పత్రాల కోసం ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమేంటని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా వాట్సప్ ద్వారా 100 పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు.
మరో 90 రోజుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్హత పత్రాలను విద్యార్థులు పొందే వీలుంటుందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలు ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం తెలిపారు. డేటా అనుసంధానం వల్ల పారదర్శత పెరుగుతుందని, పాలనలోనూ, పథకాల్లోనూ వేగంతో పాటు అవినీతికి ఆస్కారం ఉండదని చెప్పారు. ఈ దిశగా డేటా ఇంటిగ్రేషన్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. డేటా సెంటర్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేషన్ పనుల గురించి ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్, సీఈవో దినేశ్‌కుమార్ వివరించారు. ప్రభుత్వంలో ఉన్న 40 శాఖలకు చెందిన 128 మంది విభాగాధిపతులు, 178 డేటా ఫీల్డ్‌ల వద్ద 500 టీబీల డేటా అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదని, దానిని కూడా సమీకరిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ డేటాను సత్వరమే సమీకరించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 05:17 AM