Chandrababu : అహంకారం.. ఆర్భాటం వద్దు
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:31 AM
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారంతా పదవుల్ని బాధ్యతగా భావించాలి.
అందరితో సౌమ్యంగా, గౌరవంగా మెలగండి
ప్రజలతో మమేకమై బాధ్యతగా పనిచేయండి
పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
నామినేటెడ్ పదవులు పొందినవారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ’కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారంతా పదవుల్ని బాధ్యతగా భావించాలి. ఎక్కడా పదవీ అహంకారం, హడావుడి ఉండకూడదు. అందరితో సౌమ్యంగా, గౌరవంగా వ్యవహరించాలి. నిజాయితీగా, కష్టపడి పనిచేసి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే మన నినాదాన్ని గుర్తు పెట్టుకుని, ప్రజలతో మమేకం కావాలి’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెండో జాబితాలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా మంచి అవకాశాలు పొందారు. మనది పొలిటికల్ గవర్నెన్స్ అనే విధానం అని చెప్పాం. అంటే ప్రజలకు చేసే మంచిలో మీరూ భాగస్వాములు కావడమే. తద్వారా మరింత కచ్చితత్వంతో, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఏర్పడుతుంది. అందుకే మీకొచ్చిన పదవులను బాధ్యతగా భావించి, ప్రజల కోసం పని చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ అని సీఎం సూచించారు. ‘కష్టపడిన వారికి న్యాయం చేయాలనే అంశం ప్రాతిపదికగా ముందుగా మిమ్మల్ని ఎంపిక చేశాం. పార్టీ కోసం మీ పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి.
తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులిచ్చాం. గత ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొని, ఐదేళ్లు ధైర్యంగా నిలబడినవారికి ప్రాధాన్యం ఇచ్చాం. ఎన్ని సవాళ్లు వచ్చినా నిలబడి పోరాటం చేసిన వారికి, మహిళలు, యువతకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాం. బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చే ఏకైక పార్టీగా టీడీపీ నిలుస్తుంది. చాలామంది బూత్ ఇన్‌చార్జ్‌లు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, గ్రామ, వార్డు అధ్యక్షులకు రాష్ట్రస్థాయి పదవులిచ్చాం. రానున్న రోజుల్లోనూ మరిన్ని పదవులిస్తాం. గత ఐదేళ్లు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, పార్టీ సభ్యత్వ నమోదులో, పార్టీ నిర్దేశించిన ఇతర లక్ష్యాలను చేరుకున్న వారికి నామినేటెడ్ పదవులిచ్చాం. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నవారికీ పదవి లభిస్తుందనేది నేటి ఈ పోస్టుల భర్తీ ద్వారా మరోసారి అందరికీ అర్థమైంది. రానున్న రోజుల్లో ఇంకా చాలామందికి ఆయా కార్పొరేషన్ డైరెక్టర్లుగా, ఇతర పదవులిస్తాం. పదవులు వచ్చిన నాయకులు, యువత రెండేళ్ల పదవీ కాలాన్ని సమర్థంగా ఉపయోగించుకుని, ప్రజల కోసం నిజాయితీగా, కష్టపడి పని చేయడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. కాగా నామినేటెడ్ పదవుల మొదటి జాబితాలో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టు భర్తీ చేసిన చంద్రబాబు.. 30వేల దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన తర్వాత రెండో జాబితాలో ఏకంగా 60 మందికి చైర్మన్ పదవులు, ఇద్దరి కేబినెట్ హోదాతో సలహాదారు పోస్టులు ఇచ్చారు.
Updated Date - Nov 11 , 2024 | 05:31 AM