AP Weather: ఏపీలోని ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు... కీలక ప్రకటన
ABN, Publish Date - Sep 08 , 2024 | 03:10 PM
ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటిలో వర్షాలు వీడే అవకాశం కనిపించడం లేదు. పశ్చిమ మధ్య- అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి తూర్పున 280 కిలో మీటర్లు, గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 230 కిలోమీటర్లు, పారాదీప్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 260 కిలో మీటర్లు, దిఘాకు దక్షిణంగా 390 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉంది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటిలో వర్షాలు వీడే అవకాశం కనిపించడం లేదు. పశ్చిమ మధ్య- అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి తూర్పున 280 కిలో మీటర్లు, గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 230 కిలోమీటర్లు, పారాదీప్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 260 కిలో మీటర్లు, దిఘాకు దక్షిణంగా 390 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు (సోమవారం) సాయంత్రం లేదా రాత్రికి పూరీ - దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులలో కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే (ఫ్లాష్ ఫ్లడ్స్ ) సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక రానున్న మూడు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో అధికారులు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా విజయనగరం, కళింగ పట్నం 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
జోరువానలో ఎమ్మెల్యే గణబాబు పరిశీలన..
విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు.. రామకృష్ణ నగర్‌లోని కొండవాలు ప్రాంతాలను పరిశీలించారు. జోరున వర్షం నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈరోజు, రేపు విశాఖలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Sep 08 , 2024 | 03:26 PM