Cyclone Fengal: తీరం దాటిన ఫెంగల్ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:17 PM
ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. దీంతో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక అన్ని పోర్టుల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది.
విశాఖపట్నం, డిసెంబర్ 01: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. అయితే పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తుపాన్ మారనుందని తెలిపింది.
Also Read: పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..
ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశముందని వివరించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఇక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయంది. దక్షిణ కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్ల వద్దని మత్య్సకారులకు వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఇక తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని పోర్టులల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉప సంహరించినట్లు ప్రకటించింది. అయితే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశ ముందని హెచ్చరించింది.
ఫెంగల్ తుపాన్ కారణంగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో 17 సెంటిమిటర్ల మేర వర్ష పాతం నమోదు అయిందని వాతావరణ విభాగం వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో తగు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
మరోవైపు ఈ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియట్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 04:17 PM