కోస్తాకు తుఫాన్ ముప్పు!
ABN, Publish Date - Nov 25 , 2024 | 02:29 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 25కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనున్నది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
నేటి కల్లా వాయుగుండంగా మారే చాన్స్
నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 25కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనున్నది. ఇది 27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫాన్‌గా బలపడుతుందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి.ఐరోపాకు చెందిన ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ ప్రకారం తీవ్ర అల్పపీడనం 26 వరకు పశ్చిమంగా పయనించి తరువాత బలపడి వాయుగుండంగా మారేక్రమంలో ఉత్తర వాయవ్యంగా పయినించి 28 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. తరువాత అల్పపీడనం/తీవ్ర అల్పపీడనంగా మారుతూ 30న రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుంది. ఎన్‌సీయూఎం మోడల్ ప్రకారం తీవ్ర అల్పపీడనం 26దీకల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, తరువాత వాయువ్యంగా పయనించి 28వ తేదీ రాత్రికి పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుంది. ఈ రెండు మోడళ్ల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే, ఐఎండీ, జీఈపీఎస్ ప్రకారం ఆదివారం రాత్రికి వాయుగుండంగా మారి, తరువాత 26 సాయంత్రానికి శ్రీలంక వద్ద నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో తుఫాన్‌గా బలపడుతుంది. తరువాత మయన్మార్ వైపు గా వెళుతుంది. ఎన్‌సీఈపీ మో డల్ ప్రకారం కూడా వాయుగుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయువ్యంగా పయనించి, మయన్మార్ వైపు వెళ్లనుంది. సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురుస్తాయి. 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 30న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వాతావరణశాఖ హెచ్చరికలతో రైతాంగానికి గుబులు పట్టుకుంది. 27 నుంచి 30 వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి దండిగా పండింది. కోతలు సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీతలు పుంజుకున్నాయి. రబీ పంటలు మొలక, మొక్క దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిస్తే.. నష్టం ఖాయమని రైతులు చెబుతున్నారు.
Updated Date - Nov 25 , 2024 | 02:32 AM