పోర్టుల నిర్మాణాలను పూర్తి చేస్తాం
ABN, Publish Date - Oct 06 , 2024 | 04:21 AM
రాష్ట్రంలో పోర్టు ఆధారిత వాణి జ్య అవకాశాలు పుష్కలంగా ఉన్నందున నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను పూర్తి చేస్తామని దామచర్ల సత్యనారాయణ(సత్య) చెప్పారు.
మారిటైం బోర్డు చైర్మన్ సత్య
అమరావతి/ఒంగోలు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోర్టు ఆధారిత వాణి జ్య అవకాశాలు పుష్కలంగా ఉన్నందున నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను పూర్తి చేస్తామని దామచర్ల సత్యనారాయణ(సత్య) చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని బోర్డు కార్యాలయంలో శనివారం 12.36 గంటల సమయంలో ఆర్‌అండ్‌బీ, పోర్టుల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాయల్ ఫంక్షన్ హాలులో అభినందన సభ జరిగింది. కొండపి నియోజకవర్గంతోపాటు ప్రకాశం జిల్లా నుంచి తరలివచ్చిన శ్రేణులు, దామచర్ల కుటుంబ అభిమానులతో మారిటైం బోర్డు కార్యాలయం, ఫంక్షన్ హాలు కిక్కిరిసిపోయాయి.
రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, అప్పలనాయుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ము ఖ్య నాయకులు పెద్దసంఖ్యలో హాజరై సత్యను అభినందించారు. ఈసందర్భంగా సత్య ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్‌గా తనను నియమించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సాగరమాల పథకం కింద కేం ద్రం నుంచి నిధులను రాబడుతూ సకాలంలో పోర్టుల నిర్మాణాలను చేపడతామని, రాష్ట్రంలో 14 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇప్పటికీ బందరు పోర్టు పూర్తికాలేదని, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కూడా ఇప్పటికే పూర్తికావాల్సి ఉన్నా.. దీనిని రాజకీయ లబ్ధి కోసమే వాడుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించేతప్ప.. చిత్తశుద్ధితో పూర్తి చేసేందుకు ప్రయత్నించలేదన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 04:21 AM