ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పడిలేచిన నగరం దశాబ్దం క్రితం హుద్‌ హుద్‌తో వైజాగ్‌ కకావికలం

ABN, Publish Date - Oct 12 , 2024 | 05:07 AM

పదేళ్ల క్రితం ఇదే రోజు హుద్‌ హుద్‌ తుఫాన్‌ దాటికి విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. తెల్లవారుజాము నుంచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.

‘ఉక్కు’ సంకల్పంతో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొన్న విశాఖ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అది 2014 అక్టోబరు 12. ఓ తుఫాను హెచ్చరిక విశాఖ ప్రజలను విపరీతంగా కలవరపెట్టింది. అభివృద్ధి పథంలో వడివడిగా అడుగులు వేస్తున్న నగరంపై హుద్‌ హుద్‌ పేరుతో వచ్చిన ఆ తుఫాను విరుచుకుపడింది. సిటీ ఆఫ్‌ డెస్టినీని డెస్ట్రాయ్‌గా మార్చేసిందా అన్నట్లు కకావికలం చేసేసింది. ఒక నగరంపై తుఫాను విరుచుకుపడటం అరుదు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నా భారీగా ఆస్తి నష్టం జరిగింది. కానీ ప్రజల ఉక్కు సంకల్పం.. నాడు సీఎంగా చంద్రబాబు మొక్కవోని కార్యదీక్ష.. ప్రభుత్వం తోడ్పాటుతో సాగర నగరం వేగంగా కోలుకుంది. ప్రకృతి దారుణ దాడిని మర్చిపోయి మళ్లీ అభివృద్ధి పథంలో వడివడిగా సాగుతూ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా ముందుకు పరుగెడుతోంది.

పదేళ్ల క్రితం ఇదే రోజు హుద్‌ హుద్‌ తుఫాన్‌ దాటికి విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. తెల్లవారుజాము నుంచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. అటువంటి స్థితి నుంచి పడి లేచిన కెరటంలా విశాఖపట్నం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసింది. పెను తుపాన్‌ ‘హుద్‌ హుద్‌’ను తట్టుకొని ‘ఉక్కు‘ నగరం అని నిరూపించుకుంది. అభివృద్ధి బాట పట్టి స్మార్ట్‌ సిటీగా రూపాంతరం చెందింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో కొత్త పాఠాలు నేర్చుకుంది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐదు రోజుల ముందుగానే పెను తుఫాన్‌ విశాఖ వద్దే తీరం దాటుతుందని సమాచారం ఇచ్చింది. దీంతో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఇటు ఇచ్ఛాపురం నుంచి అటు తుని వరకు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. రవాణా వ్యవస్థలో కీలకమైన రైళ్లు, బస్సులు ఆపేశారు. పారిశ్రామిక నగరం కావడం, పోర్టులు కూడా ఉండడంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నౌకలను పోర్టులకు రాకుండా చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లనీయలేదు. తూర్పు నౌకాదళాన్ని సహాయ కార్యక్రమాలకు సిద్ధం చేశారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం 60కే పరిమితమైంది. ఆస్తి నష్టం మాత్రం వేల కోట్ల రూపాయలు దాటేసింది.

  • యుద్ధ ప్రాతిపదికన చర్యలు

నాటి సీఎం చంద్రబాబు రాత్రికి రాత్రి బయలుదేరి విశాఖ చేరుకున్నారు. వారం పాటు ఇక్కడే ఉండి జనజీవనం సాధారణ స్థితికి వచ్చేలా చూశారు. రేయింబవళ్లు సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షించారు. మూడు రోజుల్లో విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరించారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులను క్లియర్‌ చేశారు. ఇంటికి ఓ మొక్క నినాదంతో నగరం అంతా మొక్కలు నాటి ఏడాది తిరిగేసరికి విశాఖను నందనవనం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు సమీక్షించారు. విధ్వంసం నాడు విశాఖను చూసిన వారు ఎవరైనా ఇప్పుడు మళ్లీ చూస్తే పెను తుపాన్‌ తాకిడికి తల్లడిల్లిన నగరం ఇదేనా? అని ఆశ్చర్యపోతారు. అంతలా నగరం అభివృద్ధి సాధించింది.

Updated Date - Oct 12 , 2024 | 10:34 AM