Deputy CM Pawan kalyan: పర్యాటకాంధ్ర
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:55 AM
రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
టూరిజం హబ్‌గా మార్చేందుకు కృషి
రాష్ట్రంలో పర్యాటకానికి అద్భుత అవకాశాలు
ఏటా పది శాతం వృద్ధికి చాన్స్
ఎకో టూరిజానికి ప్రత్యేక కార్పొరేషన్
ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు
డ్రెస్‌కోడ్‌పై భక్తులకు అవగాహన కల్పించాలి
హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తవ్వేశారు
వాటిని గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
రాష్ట్రంలో పర్యాటకుల భద్రత చాలా ముఖ్యం
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని చెప్పారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాల తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై సహచర మంత్రులు, అధికారులతో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్క్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎకో టూరిజానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం’’ అన్నారు.
రాష్ట్రంలో అడ్వెంచర్ థీమ్ పార్కులు
‘‘కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. అలాంటి థీమ్ పార్క్‌లు మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. నంద్యాలలో ఏనుగుల క్యాంపులు ఉన్నాయి. గండికోట, హార్స్‌లీహిల్స్‌ల్లో అద్భుతమైన కొండ ప్రాంతాలున్నాయి. సినిమాల ద్వారా పర్యాటక ప్రాంతాలకు సులువుగా ప్రచారం కల్పించవచ్చు. ఒక సినిమాలో ఒక స్పాట్‌ను ప్రమోట్ చేస్తే అదే కరపత్రంగా మారుతుంది. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లినపుడు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తుల ప్రస్తావన తెచ్చారు. వారికి గతంలో ఉండే సౌకర్యాలు ప్రస్తుతం తీసేశారని ఆయన చెప్పారు. సీఎంతో సమావేశం సందర్భంగా అటవీశాఖ అధికారులు మా దృష్టికి తెచ్చిన టూరిజం పోలీసింగ్ అంశం కూడా చర్చకు వచ్చింది. మన దగ్గర దేవాలయాలు అంటే పిక్నిక్ స్పాట్స్‌లా మారిపోయాయి. ఆలయాల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణాల్లో క్రమశిక్షణ, డ్రెస్‌కోడ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తమ స్వార్థానికి తవ్వేశారు. వాటిని గుర్తించి, కాపాడుకోవాలి. ముఖ్యంగా పర్యాటకుల భద్రత చాలా అవసరం’’ అని పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, దేవదాయ శాఖ కమిషన్ ఎస్.సత్యనారాయణ, పర్యాటక శాఖ సెక్రటరీ వి.వినయ్ చంద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 26 , 2024 | 06:16 AM