జగన్ దెబ్బ.. రాష్ట్రం అబ్బా!
ABN, Publish Date - Nov 19 , 2024 | 03:46 AM
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధిరేటు దిగజారింది.
ఐదేళ్లలో వృద్ధిరేటు ఢమాల్
స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారీ క్షీణత
కీలక జీఎ్‌సడీపీ సగటు వృద్ధిరేటు 13.5% నుంచి 10.44కి తగ్గుదల
జగన్ పాలనలో ధరల దరువు
బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్ఠంగా 40 శాతం భారం
సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
సభలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధిరేటు దిగజారింది. స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో రాష్ట్రం వెనుకబడింది. సోమవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక, సామాజిక సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. 2014-19నాటి ఐదేళ్లతో పోల్చితే 2019-24 మధ్య జగన్ పాలనలో అన్ని విభాగాల్లోనూ రాష్ట్రం దిగజారి పోయింది. కీలకమైన, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రంగంగా ఉన్న సేవారంగంలో 2014-19లో 11.9ు వృద్ధిరేటు నమోదైంది. జగన్ హయాంలో అది 10.2 శాతానికి తగ్గింది. అలాగే, వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమైన సాగునీరు విషయంలోనూ జగన్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. 2018-19లో సాగునీరందిన నికర భూమి 36.35 లక్షల హెక్టార్లు ఉండగా, 2023-24లో అది 32.71 లక్షల హెక్టార్లకు తగ్గింది. అదేవిధంగా విద్యకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలోనూ జగన్ సర్కారు వెనుకబడింది. 2018-19 మధ్య చంద్రబాబు హయాంలో 36.14 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరగా, 2023-24 జగన్ పాలనలో ఆ సంఖ్య 34.14 లక్షలకు తగ్గింది. ఇక, 2018-19లో 38,165 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోగా, 2023-24కు వచ్చే సరికి వీరి సంఖ్య 33,231కి తగ్గింది.
పేదరికంలో 9వ ర్యాంకు
2023లో నీతిఆయోగ్ విడుదల చేసిన ‘పేదరిక నివేదిక’లో ఆంధ్రప్రదేశ్‌కి 9వ ర్యాంకు వచ్చింది. 2.42 శాతం పేదరికంతో పశ్చిమగోదావరి, 3.34 శాతంతో కడప జిల్లాలు రాష్ట్రంలో అతితక్కువ పేదరికం ఉన్నవిగా నిలిచాయి. 12.84 శాతంతో కర్నూలు, 8.66 శాతంతో విజయనగరం అత్యధిక పేదరికం ఉన్న జిల్లాలుగా నీతిఆయోగ్ నివేదికలో పేర్కొంది.
2023-24లో ఉపాధి హామీ పనుల అమల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రం 4వ స్థానం సాధించింది. ఆ ఏడాది 2554.97 లక్షల పనిదినాలు కల్పించిందని సర్వేలో పేర్కొన్నారు. దీనిలో ఎస్సీలకు 572.44 లక్షల పని దినాలు, ఎస్టీలకు 290.34 లక్షల పని దినాలు, మహిళలకు 1547.26 లక్షల పనిదినాలు కల్పించారు.
రాష్ట్రంలో అన్ని వయసుల వారితో కలుపుకొని పనిచేస్తున్న వారు 48.6 శాతంగా ఉండగా, ఈ విభాగంలో జాతీయ సగటు 42.4 శాతమేనని నివేదికలో వెల్లడించారు. పనిచేస్తున్న వారిలో మహిళలు 36.9 శాతం ఉండగా, దేశ సగటు 27.8 శాతం మాత్రమే ఉంది.
స్థిర అభివృద్ధి లక్ష్యాలు నేలచూపులే
ఎస్‌డీజీల అమల్లో ఏపీ మొదటి నుంచి మెరుగైన స్థానంలో ఉండేది. కానీ, కొన్నేళ్ల నుంచి వీటి అమల్లో రాష్ట్రం వెనుకబడింది. 2018-19లో ఈ విభాగంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉండగా, 2020-21లో 4వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి దిగజారింది.
అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో నం.1 స్థానంలోనే ఏపీ ఉంది.
ఆరోగ్యం, మెరుగైన జీవనశైలి సూచీలో 2020-21లో 7వ ర్యాంకు సాధించగా, 2023-24లో 11వ ర్యాంకుకు పతనం
లింగ సమానత్వం సూచీలో 2020-21లో 5వ ర్యాంకులో ఉండగా, 2023-24 నాటికి 14వ ర్యాంకుకు దిగజారింది.
పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు సూచీలో 2020-21లో రాష్ట్రం 4వ ర్యాంకులో ఉండగా, 2023-24లో 11వ స్థానానికి పడిపోయింది.
మెరుగైన పని, ఆర్థికవృద్ధి సూచీలో 2020-21లో 6వ ర్యాంకులో ఉండగా 2023-24లో 16వ స్థానానికి పతనం
పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సూచీలో 2020-21లో 13వ స్థానంలో ఉండగా, 2023-24లో 21వ స్థానానికి క్షీణించింది.
సర్వేలోని ముఖ్యాంశాలు
2014-19తో పోల్చితే 2019-24లో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడింది.
2014-19లో జీఎ్‌సడీపీ సగటు వృద్ధిరేటు 13.5 శాతం మేర పెరగ్గా, 2019-24లో ఆ వృద్ధిరేటు సగటు 10.6 శాతానికి క్షీణించింది.
2019-24లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, 2014-19లో ఈ రంగంలో 16.6 శాతం వృద్ధి నమోదైంది.
పారిశ్రామికరంగంలో 2014-19లో సగటున 11.9 శాతం వృద్ధిరేటు నమోదు కాగా, 2019-24లో 12.9 శాతానికి వృద్ధిరేటు పెరిగింది. 2014-19లో వచ్చిన పెట్టుబడుల కారణంగా 2019-24లో పారిశ్రామిక వృద్ధిరేటు స్వల్పంగా పెరగడం గమనార్హం.
2023-24లో రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.14.40 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2022-23లో జీఎ్‌సడీపీ రూ.13.04 లక్షల కోట్లుగా నమోదైంది.
2023-24లో తలసరి ఆదాయం రూ2,42,479 కాగా, 2022-23లో రూ.2,19,881గా నమోదైంది.
వ్యవసాయ, సేవా, పారిశ్రామిక రంగాల్లో దారుణంగా క్షీణించిన వృద్ధిరేటు.
2014-19లో తలసరి ఆదాయం 13.21 శాతం పెరగ్గా, 2019-24లో 9.61 శాతం మేర తగ్గింది.
2014-19లో నికరసాగు 60.49 లక్షల హెక్టార్లు కాగా, 2019-24లో 49.56లక్షల హెక్టార్లకు తగ్గింది.
2018-19లో పరిశ్రమలకు రూ.756.13 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వగా, 2023-24లో కేవలం రూ.205.41 కోట్లు మాత్రమే ఇచ్చారు.
Updated Date - Nov 19 , 2024 | 03:53 AM