Duvvada Srinivas: దువ్వాడ డ్రామా
ABN, Publish Date - Sep 01 , 2024 | 04:35 AM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడిన మరో డ్రామా బయటపడింది. దివ్వెల మాధురితో కలిసి ఆడిన ఆత్యహత్యాయత్నం నాటకం గుట్టురట్టయింది.
మాధురి ఆత్మహత్యాయత్నం ఉత్తిదే
ఆ రోజు జరిగింది కారు ప్రమాదమే
ఎమ్మెల్సీ డైరెక్షన్‌లో ఆమె నాటకం
ప్రమాదం జరిగాక శ్రీనుకు మాధురి ఫోన్
వాణి అరాచకం వల్ల ఆత్మహత్యాయత్నం
చేశానని మీడియాకు చెప్పాలని శ్రీను సూచన
ఆయన చెప్పినట్టు రక్తికట్టించిన మాధురి
తాజాగా ఇద్దరి ఫోన్ కాల్ ఆడియో లీక్
శ్రీకాకుళం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడిన మరో డ్రామా బయటపడింది. దివ్వెల మాధురితో కలిసి ఆడిన ఆత్యహత్యాయత్నం నాటకం గుట్టురట్టయింది. దువ్వాడ శ్రీనుతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి మూడు వారాల కిందట ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. దువ్వాడ వాణి(శ్రీను భార్య) తనపై ఆరోపణలు చేయడం వల్లనే తాను ఆత్మహత్యాయత్నం చేశానని అప్పట్లో మాధురి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా శనివారం ఉదయం ఓ ఆడియో కాల్ లీకయింది. ఇందులో దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి జరిపిన ఫోన్‌కాల్ సంభాషణ ఉంది. ఆ రోజు ప్రమాదం జరిగితే.. ఆ ఘటనను ఆత్మహత్యాయత్నంగా ఎలా రక్తికట్టించారన్నది ఈ ఆడియోలో స్పష్టంగా ఉంది. దీంతో మాధురి ఆత్మహత్యాయత్నం ఘటన అంతా డ్రామా అని తేలిపోయింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనం నవ్వుకుంటున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే...
దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న దివ్వెల మాధురి మూడు వారాల కిందట కారు డ్రైవ్ చేసుకుంటూ హైవేలో మరో వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. ఆ సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. 108 అంబులెన్స్‌లో మాధురిని పలాస ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆమె దువ్వాడ శ్రీనుకు ఫోన్ చేశారు. కారు ప్రమాదం జరిగినట్టు కాకుండా, దువ్వాడ వాణి చేస్తున్న అరాచకం వల్ల ఆత్మహత్యకు యత్నించానని మీడియాకు చెప్పాలని మాధురికి శ్రీను సూచించారు. ఇందుకు మాధురి ఒప్పుకొన్నారు. ప్రెస్‌ను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని, తాను ఇదే విషయం చెబుతునానని శ్రీనుకు చెప్పారు. ఆ వెంటనే ఆత్యహత్యాయత్నం నాటకం రక్తిగట్టించారు.
శ్రీను, మాధురి ఫోన్ సంభాషణ ఇదీ...
మాధురి: ఏవండీ...
దువ్వాడ: ఎలా ఉందే
మాధురి:పర్లేదు
దువ్వాడ: ఏం పనిచేశావు.. ఎంత పనిచేశావు? అందుకే నేను వాడ్ని తీసుకెళ్లు అంటే నామాట వినవు
మాధురి: తీసుకెళ్లుంటే వాడికి కూడా ఏదో అయిపోయేది.
దువ్వాడ: ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది?
మాధురి: తలకు దెబ్బ తగిలింది. తలంతా నొప్పిగా ఉంది
దువ్వాడ: ఇప్పుడు నిన్ను హాస్పిటల్‌లో పెట్టారా?
మాధురి: 108లో ఉన్నానండీ. పలాసలో..
దువ్వాడ: హేమాచలం నీ వెనక వస్తున్నాడు. దగ్గరకు వచ్చేశాడు. పద్మను, అవినాశ్‌ను పంపిస్తున్నాను. ఏమీ వర్రీ అవకు. నువ్వు ఒకటే చెప్పు. ‘నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలనే ఇలా చేశా. నాపై దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం, నాలుగు రోజుల నుంచి జరిగిన అరాచకాల వల్లనే చనిపోవాలనే ఇలా గుద్దేశా’ అని చెప్పు. అన్నీ నేను చూస్తా.
మాధురి: హా.. నేను మనస్తాపం చెంది గుద్ది చచ్చిపోదామని చేశా అని చెబుతా
దువ్వాడ: హా.. అదే వర్డ్. కారణం దువ్వాడ వాణి
మాధురి:ప్రెస్‌ను పంపండి. ఇదే చెబుతా
దువ్వాడ:నువ్వు ఎమోషనల్ అవ్వొద్దు. చనిపోవాలని నాకు నేనుగా గుద్దేశానని చెప్పాలి
మాధురి: నేను బాగానే ఉన్నా. అభికి చెప్పి జీహెచ్‌కు పంపించండి. ప్రెస్‌కు చెప్పి జీహెచ్‌కు పంపించండి
దువ్వాడ:వాళ్లు నీవద్దకు వస్తున్నారు. నేను మెసేజ్ పాస్ చేసేస్తున్నా
మాధురి: నేను బాగానే ఉన్నా. కొంచెం లిప్స్‌కు దెబ్బతగిలింది. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు కారు బోల్తా పడి పల్టీ కొట్టేసింది. లక్కీగా ఎవరో వచ్చారు. లేకుంటే పెట్రోల్ లీకై ప్రమాదం జరిగేది
దువ్వాడ: నువ్వు ఇవన్నీ మాట్లాడకు శ్రీనును తొలగించాలి: వాణి
దువ్వాడ శ్రీను, మాధురి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో టెక్కలి జడ్పీటీసీ, దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి మీడియాతో మాట్లాడారు. దువ్వాడ శ్రీనును వైసీపీ నుంచి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భర్త దువ్వాడ శ్రీను, ఆయన తల్లి, ఆయన సోదరుడు బాబా తనపై కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తుల్ని ఇంకా వైసీపీలో ఉంచడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. కుట్రల ఆలోచనలతో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనుపై తమ పిల్లల భవిష్యత్ కోసమే తాను పోరాడుతునాన్నని స్పష్టం చేశారు.
Updated Date - Sep 01 , 2024 | 09:16 AM