వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:26 AM
ఏలేరు రిజర్వాయర్ కన్నెర్ర జేసింది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో వరద ముంచెత్తింది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావంతో కొన్ని కాలనీలు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంట వరద పాలైంది.
గొల్లప్రోలు, సెప్టెంబరు 9: ఏలేరు రిజర్వాయర్ కన్నెర్ర జేసింది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో వరద ముంచెత్తింది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావంతో కొన్ని కాలనీలు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంట వరద పాలైంది. ఈమేరకు సమాచారం అందుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సోమవారం హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి నేరుగా గొల్లప్రోలు జగనన్న కాలనీకి చేరుకున్నారు. అక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్ వర్మ, జనసేన, బీజేపీ ఇన్‌చార్జిలు మర్రెడ్డి శ్రీని వాసరావు, డాక్టర్ బుర్రా కృష్ణంరాజు, జిల్లా కలెక్టరు సగిలి షాన్‌మోహన్, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌తో కలిసి బోటులో జగనన్న కాలనీ సందర్శనకు బయలుదేరారు. సుద్దగడ్డ వరద ముంపు బారినపడిన గొల్లప్రోలు పట్టణ శివారు జగనన్న కాలనీలో విస్తృతంగా పర్యటించారు. బోటులో వెళ్లి వరదనీటిలో, బురదమయంగా మారిన రహదారుల్లో నడుస్తూ జగనన్న కాలనీ వాసులను పలకరించి వారి కష్టాలను తీరుస్తానని భరోసా ఇచ్చా రు. కాలనీవాసులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. జగనన్న కాలనీకి వచ్చిన తర్వాత అష్టకష్టాలుపడుతున్నామని,కనీసం తాగునీరు అందడం లేదని, రోడ్లు, డ్రెయిన్లు లేవని, తమ పిల్ల లు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్‌కు మొరపెట్టుకున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, బ్రిడ్జి నిర్మించాలని, తాటిపర్తి రోడ్డుకు అనుసంధానంగా రోడ్డు నిర్మించాలని విన్నవించారు. అందరి కష్టాలు విని మీకు నేను న్నానంటూ భరోసా ఇచ్చారు.
ఆరోగ్యం బాగాలేకున్నా వచ్చా : పవన్
మెట్టలో ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. వరద ముంపు తగ్గగానే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆరోగ్యం సహకరించకున్నా వరద పరిస్థితిని సమీక్షించేందుకు తాను స్వయంగా వచ్చినట్టు తెలిపారు. జగనన్న కాలనీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలైపోయారన్నారు. వరద ప్రాంతాల సందర్శన అనంత రం పవన్ అత్యవసర సమీక్ష కోసం మంగళగిరి వెళ్లారు.
Updated Date - Sep 10 , 2024 | 12:26 AM