14 రోజుల్లోగా చెత్త తొలగించాలి
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:15 AM
రహదారుల వెంబడి ఉన్న చెత్త కుప్పలను తక్షణమే తొలగించి ఎస్‌డబ్లూపీసీ (చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం)లకు తరలించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అమలాపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రహదారుల వెంబడి ఉన్న చెత్త కుప్పలను తక్షణమే తొలగించి ఎస్‌డబ్లూపీసీ (చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రం)లకు తరలించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, కాల్వలు, ఏటిగట్లు వెంబడి ఉన్న చెత్తకుప్పలను తక్షణమే తొలగించి సమీపంలోని సాలిడ్‌వెల్త్ ప్రోసెసింగ్ సెంటర్లకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు 14 రోజుల్లో తమ పరిధిలో ఎక్కడా చెత్త కుప్పలు లేవని రాత పూర్వకంగా నివేదించాలన్నారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 270 ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. వీటిలో 193 పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. వివిధ కారణాలతో 77 షెడ్లు పనిచేయడం లేదన్నారు. మరో మూడు నెలల్లో 77 షెడ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అదనంగా మరో 50 షెడ్లు నూతనంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పంచాయతీ ఆదాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల ఆదాయం, ఖర్చులను వివరిస్తూ ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఆర్థిక అంశాలపై అవగాహన కలిగిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఈవోపీఆర్డీలను ఒక బృందంగా నియమించి సాంకేతిక నిపుణుల సహాయంతో సంబంధిత పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీల అనుమతి లేకుండా జిల్లాలో ఎక్కడా ఫెర్రీలు నిర్వహించరాదన్నారు. మండలాల పరిధిలో ఉన్న ఫెర్రీలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ఆరా తీశారు. అనుమతులు లేకుండా నిర్వహించే ఫెర్రీలను గుర్తించి నివేదిక అందించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి డి.రాంబాబు, డివిజనల్ పంచాయతీ అధికారి పి.బొజ్జిరాజు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:15 AM