ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోనసీమ సర్వతోముఖాభివృద్ధికి సహకారమందిస్తా

ABN, Publish Date - Dec 19 , 2024 | 12:39 AM

ప్రకృతి అందాలతో పరవశింపజేసే కోనసీమ జిల్లా అన్ని రంగాల్లోను సర్వతోముఖాభివృద్ధి సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గల గోదావరి భవన్‌లో బుధవారం సాయంత్రం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు.

అమలాపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాలతో పరవశింపజేసే కోనసీమ జిల్లా అన్ని రంగాల్లోను సర్వతోముఖాభివృద్ధి సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గల గోదావరి భవన్‌లో బుధవారం సాయంత్రం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు. ప్రధానంగా ఈ సమీక్షలో ప్రాథమిక రంగ సెక్టార్‌, వాటి అనుబంధ రంగాలైన వ్యవసాయం, ఇరిగేషన్‌, పశుసంవర్ధక డెయిరీ డెవలెప్‌మెంట్‌, ఉద్యాన, మత్స్య విభాగాలతో పాటు ఉచిత ఇసుక పాలసీ, ధాన్యం కొనుగోలు, దీపం-2 పథకం, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లా అన్నిరంగాల్లోను సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన వరి వంగడాలు, హైబ్రిడ్‌ కొబ్బరి వంగడాలను అందించి వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడల్లో తలసరి ఆదాయం రూ.2 లక్షల 70 వేలు ఉంటే వ్యవసాయ ఆధారిత కోనసీమలో రూ.70 వేలు ఉందన్నారు. కోనసీమలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు ఎంఎస్‌ఎంఈ ద్వారా పారిశ్రామికవేత్తలను ఆశ్రయించి ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్‌లు రాజోలు, తూర్పుపాలెం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన జిల్లాలో హార్బర్లు, జెట్టీలు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. టెంపుల్స్‌, బీచ్‌, పర్యాటక ప్రాంతాలను ఒక సర్క్యూట్‌గా చేసి అభివృద్ధి చేయడం వల్ల ఎందరికో ఉపాధి కలుగుతుందన్నారు. నరేగా నిధులతో డ్రైనేజీ, పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి పనులు చేపట్టేందుకు కృషి చేయాలని సూచించారు. ఆక్వా కల్చర్‌పై దృష్టి సారించి ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నాన్‌ ఆక్వాజోన్‌లో నిబంధనలు కచ్చితంగా అమలుచేసి అక్రమ చెరువుల తవ్వకాలు నిరోధించాలని కలెక్టర్‌కు సూచించారు. వ్యవసాయానికి అనువుగా లేని చౌడు, పర్ర భూముల్లో మాత్రమే ఆక్వా సేద్యానికి అనుమతించాలని ఆదేశించారు. నూతన జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణాలకు ముందడుగు వేయాలని మంత్రి సూచించారు. పట్టణంలో రోడ్లు, విస్తరణ చేపడితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. అమలాపురం, రాయవరం రైతు బజార్లలో ఎస్టేట్‌ అధికారులను నియమించి పునఃప్రారంభించాలని ఆదేశించారు. వచ్చే రబీలో అధికారులు సూచించిన వంగడాలను రైతులు నాటాలని మంత్రి కోరారు. కోకోనట్‌ బోర్డు కార్యాలయాన్ని స్థానికంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని, తద్వారా కొబ్బరి అనుబంధ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుందన్నారు. పశుగ్రాసం కొరతను నివారిస్తామన్నారు. ఇరిగేషన్‌శాఖ డ్రెయిన్లు, కాల్వలు పనులపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి నెలలో ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ధాన్యాన్ని ఎన్డీయే ప్రభుత్వం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాకు డబ్బులు జమ చేయడం అత్యంత గర్వకారణమైన విషయమని, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1600 కోట్లను తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. జిల్లాలో ఉన్న 12 ఇసుక ర్యాంపుల ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని సూచించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అడిగిన ఓ ప్రశ్నపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకాలు జీవో ప్రకారం చేపట్టింది లేనిదీ తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలో విభజన జరిగినప్పటికీ అధికారులు ఎక్కడో కాకినాడలో ఉండి ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తే కుదరదన్నారు. దీనిపై కేబినేట్‌లో చర్చిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ జిల్లాలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి నివేదికను ఇన్‌చార్జి మంత్రికి వివరించారు. 2047 డాక్యుమెంట్లను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ప్రభుత్వ విప్‌ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, దేవ వరప్రసాద్‌, గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, యిళ్ల వెంకటేశ్వరరావు, కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్‌తో పాటు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు డీఆర్సీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అంచనాల కమిటీ చైర్మన్‌ వేగుళ్ల జోగేశ్వరరావుల మధ్య పలు అంశాలపై వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం.

Updated Date - Dec 19 , 2024 | 12:39 AM