మందుబాబులకు పండగ
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:17 AM
ప్రభుత్వ మద్యం దుకాణాలు కాస్తా బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు కావడం, అలాగే ఇప్పటివరకు రకరకాల బ్రాండ్లను తాగి విసిగివేసారిపోయిన మందుబాబులకు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులకు పండుగ వాతావరణం మొదలైంది.
నేటి నుంచి మద్యం విక్రయాలు ప్రారంభం
బ్రాండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు
ప్రారంభం కానున్న 133 షాపులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మద్యం దుకాణాలు కాస్తా బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు కావడం, అలాగే ఇప్పటివరకు రకరకాల బ్రాండ్లను తాగి విసిగివేసారిపోయిన మందుబాబులకు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులకు పండుగ వాతావరణం మొదలైంది. గత ఐదేళ్లుగా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో విక్రయించిన నాసిరకం మద్యం తాగిన వారికి ఇక ప్రముఖ బాండ్లకు చెందిన మద్యం దొరకనుంది. దీంతో వారి ఆనందాలకు అవధుల్లేవు. దీనికితోడు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే మద్యం విక్రయాలు జరగనుండడంతో వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆరు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో గల 133 మద్యం షాపులకు గాను 4078 మంది దరఖాస్తులు చేశారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ప్రశాంతంగా లక్కీడ్రా నిర్వహించి విజేతల ఎంపిక పూర్తి చేశారు. దీంతో ఎంపికైనవారు సిండికేట్‌లతో చేతులు కలిపి వ్యాపార లావాదేవీల నిర్వహణకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 133 మద్యం షాపులకు ఎంపికైన వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధరావతు సొమ్ములు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం జిల్లాలో ఉన్న ఆరు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో వ్యాపారులతో ఆయా కార్యాలయాలు కిటకిటలాడాయి. చలానాలు చెల్లించి ఎక్సైజ్ ఆఫీసులకు మద్యం వ్యాపారులు క్యూలు కట్టారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వ్యాపారులకు అధికారికంగా మద్యం విక్రయాలకు సంబంధించి లైసెన్సులు జారీ కానున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ ఆఫీసులు మద్యం వ్యాపారాలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు షాపులు ఎక్కడ తీసుకోవాలనే దానిపై వ్యాపారులు దృష్టి పెట్టారు. ఎక్కువ విక్రయాలు జరిగే ప్రదేశాలను ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు తీసుకునేందుకు లాబీయింగ్‌లు చేస్తున్నారు. బుధవారం నుంచే మద్యం షాపుల్లో విక్రయాలు ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో అన్ని షాపుల్లోను అమ్మకాలు జరిగేలా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా జిల్లాలో గల 133 మద్యం షాపుల్లో ఇకపై ప్రముఖ కంపెనీల మద్యం అందుబాటులో ఉండనుంది. దీనిలో భాగంగా ఆయా కంపెనీలకు సంబంధించిన సరుకు ఇప్పటికే లిక్కరు డిపోలకు చేరుకున్నట్టు సమాచారం. ఎంసీ విస్కీ, ఐవీ, రాయల్‌స్టాగ్, రాయల్‌గ్రీన్‌లతో పాటు కింగ్‌ఫిషర్, 100 పైపర్స్ వంటి బీర్లు కూడా మద్యం షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. గతంలో భూమ్‌భూమ్ లాంటి పేర్లతో నాసిరకం బ్రాండ్‌లకు సంబంధించిన మద్యం విక్రయాలు ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయించారు. వీటిని తాగిన మద్యం ప్రియులు వేల సంఖ్యలో అనారోగ్యానికి గురైనవారు కొందరైతే మృత్యువాత పడ్డవారి సంఖ్య కూడా అదే రీతిలో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ నూతన పాలసీ విధానంలో భాగంగా బ్రాండెడ్ కంపెనీల మద్యం విక్రయించాలన్న నిర్ణయం పట్ల మద్యం ప్రియులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Oct 16 , 2024 | 12:17 AM