అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి నిరసన
ABN , Publish Date - Feb 23 , 2024 | 12:12 AM
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో అధికారుల తీరును నిరసిస్తూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలతను కలిసి అనపర్తి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు.

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 22: తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో అధికారుల తీరును నిరసిస్తూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలతను కలిసి అనపర్తి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే కలెక్టర్, జేసీ, డీఆర్‌వో అందుబాటులో లేకపోయినా చాంబర్ చాంబర్‌కు తిప్పడంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక చోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌కు మధ్యాహ్నం వచ్చామన్నారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నారని చెప్పడంతో జాయింట్ కలెక్టర్ కోసం చూశామన్నారు. అయితే ఆయన ట్రైనింగ్‌లో ఉన్నారని చెప్పారన్నారు దీంతో డీఆర్‌వో కోసం చూస్తే అక్కడ ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉందన్నారు. ఇలా 45 నిమిషాల పాటు అన్ని చాంబర్లు తిరిగినా ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. దీంతో అధికారుల తీరుకు బైఠాయించి నిరసన తెలిపామన్నారు. అప్పుడు ఒక అధికారి వచ్చి వినతి తీసుకున్నారన్నారు. బదిలీ అయ్యివెళ్ళిన పోసిబాబు అనే తహశీల్దార్ తిరిగి అనపర్తి వచ్చి డమ్మీ పట్టాలపై సంతకం చేయడం, అలాగే జరగని భూసేకరణ జరిగినట్లు చెబుతూ గ్రామాల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది రెవెన్యూ అధికారులు కలిసి డమ్మీ పట్టాలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ పట్టించుకునే వారే లేరన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.