రేపే జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:56 PM
గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. సెప్టెంబరు 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆగస్టు 31న ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అఽధికారులను ఆదేశించారు.
అమలాపురం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. సెప్టెంబరు 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆగస్టు 31న ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అఽధికారులను ఆదేశించారు. 30వ తేదీ సాయంత్రంలోగా బ్యాంకుల నుంచి పెన్షన్ల నగదును విత్‌డ్రాచేసి క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేయాలన్నారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యే వరకు సాధారణ బదిలీల నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బందిని రిలీవ్ చేయవద్దని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పెన్షన్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. 31వ తేదీ సాయంత్రానికి నూరుశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే లీడ్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. సాయంత్రంలోగా క్షేత్రస్థాయి సిబ్బందికి లబ్ధిదారుల మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. 31వ తేదీ ఉదయం 6 గంటలకు అన్ని సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని లేని పక్షంలో సంబంధిత ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోజున ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్లు అందుకోని పక్షంలో సెప్టెంబరు 2న అందించాలన్నారు. జిల్లాలో 2,41,354 మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్ల కింద రూ.100.51 కోట్లు లబ్ధి అందుతుందన్నారు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యేకంగా 41.06 మంది సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన 131 మందితో కలిసి 4237 మంది పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ వర్మ, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Updated Date - Aug 29 , 2024 | 11:56 PM