ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh : తూర్పు కనుమలకూ ముప్పు

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:41 AM

పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.

  • అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం

  • గనుల తవ్వకాలతో కొండలు ధ్వంసం

  • ఇష్టానుసారంగా పర్యాటక రిసార్టులు

  • హైడల్‌ ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాలు

  • ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో తరచూ

  • విరిగిపడుతున్న కొండ చరియలు

  • రైల్వే రవాణాకూ అంతరాయం

  • రిజర్వాయర్ల మనుగడకు ప్రమాదం

  • పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే

  • వయనాడ్‌ తరహాలో ముప్పు

  • భూగర్భ జల నిపుణుల హెచ్చరిక

దేవభూమి కేరళలో ‘వయనాడ్‌’ విలయం (Wayanad Landslides) అంతులేని విషాదం మిగిల్చింది. కొండచరియలు విరిగిపడటంతో పశ్చిమ కనుమల్లోని పచ్చటి గ్రామాలు మరుభూమిగా మారాయి. అభివృద్ధి పేరిట అక్కడ సాగించిన ప్రకృతి విధ్వంసమే ఈ మహా విషాదానికి కారణమని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. కేరళలో చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లోనూ అభివృద్ధి పేరిట కొండల స్వరూపాన్ని మార్చేస్తున్నారు. అరకులో సహజ సిద్ధంగా ఉండే వాగులు, పాయలను మూసివేస్తున్నారు. పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే వయనాడ్‌ తరహాలో ఏపీలోనూ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అరకులోయ ప్రాంతంలో 1990, 2006, 2014లో కొండ చరియలు విరిగిపడి అనేకమంది మృత్యువాత పడ్డారు. వయనాడ్‌లో మాదిరిగానే 2006 ఆగస్టు 3వ తేదీ రాత్రి కొండచరియలు, బురదతో కూడిన వరద అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 19 మంది సజీవ సమాధి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. అక్కడ అభివృద్ధి పేరిట ప్రాజెక్టులు, రిసార్టులు విచ్చలవిడిగా నిర్మించారని, ఈ క్రమంలో సహజ సిద్ధమైన సెలయేళ్లు, వాగులను పూడ్చివేయడంతో కొండలు సహజ సిద్ధమైన స్థిరత్వాన్ని కోల్పోయాయని వివరించారు. అందుకే వయనాడ్‌ను వరద ముంచెత్తిందని, భవిష్యత్‌లో పశ్చిమ కనుమల్లో మరిన్ని విలయాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ కనుమల తరహాలోనే తూర్పు కనుమలు కూడా ముప్పు ముంగిట ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో బైలదిల్లాలోని ఇనుప ఖనిజం కిరండూల్‌ నుంచి విశాఖపట్నం తీసుకువస్తోంది. ఇందుకు ఏళ్ల కిందట కొండలు తవ్వి ట్రాక్‌లు, టన్నెళ్లు నిర్మించింది. ఆ మార్గంలో తరచూ కొండ చరియలు విరిగిపడుతున్న విషయాన్ని నిపుణులు ఉదాహరిస్తున్నారు. తూర్పు కనుమలకు పొంచి ఉన్న ముప్పుపై నిపుణులు విశ్లేషించారు.


అభివృద్ధి పేరుతో ధ్వంసం

తూర్పు కనుమలు ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని నీలగిరి కొండల వరకూ సుమారు 75వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల కంటే పురాతమైన తూర్పు కనుమలు ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉన్నాయి. జీవవైవిధ్యం పుష్కలంగా ఉన్న తూర్పు కనుమల్లో అనేక రకాల ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. తూర్పు కనుమల్లో కొండలపై చిన్నపాటి వాగులు ప్రవహిస్తుంటాయి. వాటిని విధ్వంసం చేయకపోతే కొండలపై కురిసిన వర్షం కిందకు పారుతుంది తప్ప ఇబ్బందులు కలిగించదు. కానీ చాలాకాలం నుంచి తూర్పుకనుమల్లో అభివృద్ధి పేరిట ప్రకృతిని ధ్వంసం చేయడం మొదలెట్టారు. గనుల తవ్వకాలు చేపట్టి, వాటి రవాణా కోసం రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు నిర్మించారు. దీనికితోడు పర్యాటకం పేరుతో కొండలు, వాలు ప్రాంతాల్లో రిసార్టులు, హోటళ్లు, ఇతరత్రా కార్యకలాపాలు ప్రారంభించారు.


మానవజోక్యంతో ముప్పు

మానవ జోక్యం లేకపోతే కొండల నుంచి ఎటువంటి ముప్పూ ఉండదు. కొండవాలు ప్రాంతాల్లో తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టినప్పుడు యంత్రాలు వాడుతున్నారు. పేలుడు పదార్థాలు వినియోగించినప్పుడు ప్రకంపనలు వస్తుంటాయి. వీటివల్ల కొండలు సహజ సిద్ధంగా వచ్చే సమతుల్యతను కోల్పోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొండలపై చిన్న పగుళ్లు ఏర్పడతాయి. వీటిని గుర్తించి తీవ్రత తగ్గేంచేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పగుళ్లు పెద్దవై వర్షాకాలంలో కురిసే వాన నీరు కొండ లోపలకు వెళితే కొండ పటుత్వాన్ని కోల్పోతుంది. దీంతోకొండచరియలు జారి పడుతుంటాయని బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ మాజీ ఉన్నతాధికారి డాక్టర్‌ ఆదిభట్ల శాంతారామ్‌ పేర్కొన్నారు. వర్షాకాలంలోనే కొండచరియలు విరిగిపడుతుంటాయన్నారు.


21 ప్రాజెక్టులకు ముప్పు

ఒడిశా నుంచి ఏపీలో పోలవరం వరకు సుమారు 21 డ్యామ్‌లు తూర్పుకనుమల్లోనే నిర్మించారు. గొట్టా బ్యారేజ్‌, ఆండ్ర, వెంగళరాయిసాగర్‌, జంఝూవతి, తోటపల్లి, రైవాడ, తాండవ, ఏలేరు.. తదితర 21 ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోయింది. వీటి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగడంతో భవిష్యత్తులో ప్రాజెక్టులకు ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కొండలకు రక్షణ అవసరం

తూర్పుకనుమల్లో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడడానికి మానవ జోక్యమే కారణం. కొత్తవలస నుంచి కిరండోల్‌ వరకు రైల్వేలైన్‌లో శివలింగపురం నుంచి బొర్రాగుహలు మధ్యన కొండచరియలు ఎక్కువగా విరిగిపడుతున్నాయి. ట్రాక్‌లు, టన్నెళ్లు నిర్మించిన ప్రాంతాల్లో కొండలకు రక్షణ చర్యలు చేపట్టాలి. కొండలపై ఏర్పడిన పగుళ్లు గుర్తించి అక్కడ సిమెంట్‌ లోపలకు పంపాలి. వాలు ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించాలి. బండరాళ్లు దొర్లకుండా వాటికి రంధ్రాలు వేసి సిమెంట్‌ పంపడంతో పాటు బలమైనమెస్‌లతో కట్టాలి.

- డాక్టర్‌ ఆదిభట్ల శాంతారామ్‌,

బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ మాజీ ఉన్నతాధికారి గనుల తవ్వకాలు నిషేధించాలి

తూర్పుకనుమలకు ముప్పు పొంచి ఉంది. బాక్సైట్‌ తవ్వకాలతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రమాదం పర్యాటకం అభివృద్ధి పేరుతో అరకు లోయ ప్రాంతంలో సాగుతున్న కొండల విధ్వంసం నిలిపివేయాలి. లేకపోతే కేరళతరహా ఘటనలు తూర్పుకనుమల్లోనూ జరిగే ప్రమాదముంది.

- రెబ్బాప్రగడ రవి, సమతా స్వచ్ఛంద సంస్థ.

Updated Date - Aug 11 , 2024 | 08:36 AM

Advertising
Advertising
<