Nara Lokesh: టీచర్లపై కేసులు ఎత్తివేస్తాం..
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:08 AM
గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు.
డీజీపీతో చర్చిస్తున్నాం..
ప్రభుత్వ మార్పునకు టీచర్ల ఉద్యమమే కారణం
వారిని చూసి ప్రజలూ ఉద్యమించారు..
వైసీపీ సర్కారు కేసులతో వేధించింది
టీచర్లు విద్య మాత్రమే చెప్పాలి..
బాత్‌రూమ్ ఫొటోలు వారి పనికాదు
కేసుల్లేకుండా డీఎస్సీ పూర్తిచేస్తాం..
అధికారులు అధ్యయనం చేస్తున్నారు
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి చేసేస్తాం..
అసెంబ్లీలో లోకేశ్ వెల్లడి
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. డీజీపీతో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘విద్యార్థులు పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల విధి. వారిని హింసించడం, ఇతర పనులు అప్పగించడం చేయరాదు. కానీ, గత ప్రభుత్వం బాత్‌రూమ్‌ల ఫొటోలు వారితోతీయించింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని రద్దుచేశాం’’ అని లోకేశ్ తెలిపారు. కేసులు లేకుండా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ‘‘1994 నుంచి టీడీపీ ప్రభుత్వంలో 15 డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చాం. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 2.20 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేస్తున్నామనీ, అందులో 1.80 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సెలవిచ్చారు. ఎన్నికలకు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు 6100 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. డీఎస్సీ ద్వారా జగన్ భర్తీ చేసిన పోస్టులు సున్నా’’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే మాధవి కోరగా, ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద పరిశీలనలో ఉందని లోకేశ్ చెప్పారు.
డీఎస్సీ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారని పల్లా శ్రీనివాస్ అడగగా, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రక్రియ పూర్త్తి చేస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి టీచర్లే కారణం. ఆ రోజు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి వారి హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ రోజు నుంచి ప్రజలకు కూడా ధైర్యంవచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఆ కోపంతో టీచర్లపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధించింది’’ అని లోకేశ్ గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 6లక్షలమంది విద్యార్థులు తగ్గారన్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలల విలీనం, టీచర్లపై పనిభారం పెంచడం చేస్తూ తెచ్చిన వివాదాస్పద జీవో 117కు మార్పు చేసే దిశగా పని చేస్తున్నామని, వివిధ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు సమయం కేటాయించి ప్రతివారం వారి సమస్యలు తెలుసుకుంటున్నామని, క్షేత్రస్థాయి అంశాలు దానివల్ల తమకు తెలిసే అవకాశం లభించిందని లోకేశ్ తెలిపారు.
స్కూళ్లకు చలోచలో..
ఎమ్మెల్యేలు స్కూలుబాట పట్టాలని మంత్రి లోకేశ్ కోరారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తన నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ సూచన చేశారు. పాఠఽశాలకు ర్యాంకింగ్‌విధానం తీసుకువస్తామని, ఏబీసీడీ కేటగిరిగా పాఠశాలలను విభజించి మౌలిక సదుపాయాలు, సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. డిసెంబరు మొదటి వారంలో పీటీఎం ఏర్పాటు చేస్తున్నామనీ, ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని కోరారు.
మీ తాతగారు కట్టించిన స్కూలు అది: లోకేశ్‌ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్య
ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ... భీమిలీ, తగరపువలసలోని రెండు డిగ్రీ కాలేజీల్లో సిబ్బంది కొరత ఉన్నదని లోకేశ్ దృష్టికి తెచ్చారు. తగరపువలసలోని జూనియర్ కాలేజీలు మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సింహాచలంలోని రెసిడెన్సియల్ పాఠశాలలో వసతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. స్పీకర్ జోక్యం చేసుకుని... సింహాచలంలోని రెసిడెన్సియల్ స్కూలు మీ తాతగారు కట్టించారని లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. అందువల్లే ఆ స్కూల్‌పై తనకు మరింత బాధ్యత ఉందని మంత్రి స్పందించారు.
ఉద్యోగుల హర్షం..
ఉద్యోగ, ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. 2022, సెప్టెంబరు 1న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చామని, దీంతో నాటి వైసీపీ ప్రభుత్వం వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులపై కేసులు పెట్టిందన్నారు. ఈ కేసులపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రుల ను అనేకసార్లు కలిసి విజ్ఞప్తి చేశామని, మంత్రి లోకేశ్ సానుకూల ప్రకటన చేయడం సంతోషమని తెలిపారు. అలాగే, పాత పెన్షన్‌ను పునరుద్ధరించి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 09:00 AM