YS Sharmila: ఏపీలో కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 28 , 2024 | 06:47 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుంటే.. కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుంటే.. కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని ఆరోపించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్‌గా మారితే.. వైద్యారోగ్య శాఖ ఇంకా నిద్ర మత్తు వీడలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘పల్లెలు మంచం పట్టాయి. బాధితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న దీన దుస్థితి ఉంది. ఓపీ ఫుల్..వైద్యం నిల్.. అన్నట్లు ఉంది రాష్ట్రంలో సర్కారు వైద్యం పరిస్థితి. నియంత్రణకు చర్యలు మాత్రం లేవు. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేసేస్తారా?. జ్వరాలను అరికట్టడంపై ఇంతవరకు కార్యాచరణ లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తోంది. విషజ్వరాల కాటుకు ప్రజలు బలి కాకముందే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి’’ అని షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఏలూరు జిల్లా..
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాల తీవ్రత తక్కువేనని, విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడవద్దని జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా సీజనల్ జ్వరాలతో బాధపడుతున్న కొందరు విద్యార్థులను పరీక్షించి మందులు అందించినట్టు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ట్రిపుల్ ఐటీ అధికారులు ఖండించారు.
Updated Date - Aug 28 , 2024 | 06:56 PM