తల్లీ చెల్లిపై జగడాల జగన్
ABN, Publish Date - Oct 24 , 2024 | 02:53 AM
మమకారం మాయమైపోయింది. అభిమానం కరిగిపోయింది. ప్రేమ ద్వేషంగా మారింది! అందువల్ల... ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వను!’ ఇది... చెల్లెలు వైఎస్ షర్మిలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి! చెల్లిపైనే కాదు... తల్లి విజయలక్ష్మిపైనా పోరాటమే!
ఎన్‌సీఎల్టీలో పిటిషన్‌తో రచ్చ
అంతకుముందు షర్మిలకు జగన్ లేఖ
ఆస్తుల పంపిణీకి సరే అంటూనే.. షరతులు
తమ గురించి, అవినాశ్ గురించి మాట్లాడొద్దని కండిషన్
ఆమోదయోగ్యం కాదంటూ షర్మిల మౌనం
దీంతో ఆస్తులే ఇవ్వనంటూ జగన్ పిటిషన్
వెంటనే సోదరుడికి ఘాటుగా షర్మిల జవాబు
తండ్రి వైఎస్ పరువు తీస్తున్నారంటూ ధ్వజం
తన మాటా అదేనంటూ విజయలక్ష్మి సంతకం
రాజీ కోసం సన్నిహితుల ప్రయత్నాలు
ప్రేమాభిమానం.. రద్దు
షర్మిలకు ప్రేమాభిమానాలతో ఆస్తులు ఇద్దామనుకున్నాము. కానీ... ఆమెకు నాపై కనీస కృతజ్ఞత లేదు. షర్మిల ప్రవర్తన వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. నాపై షర్మిల బహిరంగంగా అనేక ఆరోపణలు చేశారు. రాజకీయపరమైన దాడితోపాటు వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడారు. దీనివల్ల షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలు కరిగిపోయాయి. అందుకే... ఆస్తుల పంపకంపై షర్మిలకు రాసిచ్చిన ఎంఓయూ,
గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేయాలనుకుంటున్నాం!
- ఎన్‌సీఎల్టీలో వేసిన పిటిషన్‌లో వైఎస్ జగన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మమకారం మాయమైపోయింది. అభిమానం కరిగిపోయింది. ప్రేమ ద్వేషంగా మారింది! అందువల్ల... ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వను!’ ఇది... చెల్లెలు వైఎస్ షర్మిలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి! చెల్లిపైనే కాదు... తల్లి విజయలక్ష్మిపైనా పోరాటమే! తల్లీ చెల్లిపై ఎన్‌సీఎల్టీపై ఆయన వేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సరస్వతీ పవర్‌పై షేర్ల బదిలీ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ... అసలు షర్మిలకు ఆస్తుల్లో వాటాలే ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పడం గమనార్హం. అసలు ఆస్తుల విషయంలో వైఎస్ చెప్పిందేమిటి, జగన్ చేసిందేమిటి?
వైఎస్ చెప్పిన వాటాల లెక్క ఇది...
ఆస్తులను నాలుగు సమాన వాటాలు చేసి... తన మనవళ్లు, మనవరాళ్లకు (షర్మిల పిల్లలు, జగ న్ పిల్లలు) ఇవ్వాలని వైఎస్ పేర్కొన్నారు. కానీ... జగన్ సీఎం అయ్యాక ఇందుకు ససేమిరా అన్నా రు. 60 శాతం తమకే దక్కాలని, 40 శాతం మాత్రమే షర్మిలకు దక్కుతుందని తేల్చేశారు. దీనికి అంగీకరించేది లేదని షర్మిల స్పష్టం చేశారు. ఐదుశాతం అటూ ఇటైయినా ఫర్వాలేదుకానీ... 60:40 ఫార్ములా సరికాదని విజయలక్ష్మి కూడా చెప్పారు. అయినా జగన్ పట్టించుకోలేదు. అవన్నీ తన సొంత కష్టం, తెలివి తేటలతో సంపాదించిన ఆస్తులని వాదించారు. అందులో షర్మిలకు హక్కు లేదంటూ... కేవలం ‘ప్రేమాభిమానాలతో’ ఇవ్వబోయే ఆస్తుల జాబితా అంటూ జగన్ ఒక ఎంవో యూ రూపొందించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే (2019 ఆగస్టులో) దీనిని రాసిపెట్టారు. కానీ... వాటి పంపకానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎంవోయూ రాశారేకానీ... దాని అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్తుల్లో వాటా కోసం షర్మిల చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
షరతులకు లోబడి...
షర్మిల కాంగ్రె్‌సలో చేరి... పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నపై రాజకీయ యుద్ధం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె విమర్శలు, ఆరోపణలు తాజా ఎన్నికల్లో జగన్‌ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో... గత నెల మొదటి వారంలో చెల్లితో రాజీ ప్రయత్నాలు మొదలుపెడుతూ, షర్మిలకు ఒక లేఖ రాశారు. ఆస్తుల పంపిణీకి అంగీకరిస్తూనే, అనేక షరతులు విధించారు. ‘‘భవిష్యత్తులో నా గురించి, భారతి గురించి ఏమీ మాట్లాడొద్దు. వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రస్తావన తీసుకురావొద్దు’’ అంటూ కండీషన్లు పెట్టారు. అంటే... షర్మిల రాజకీయాల నుంచి తప్పు కోవాలని, వివేకా హత్య గురించి మాట్లాడొద్దని చెప్పడమే! ఈ షరతులు ఆమోదయోగ్యం కాకపోవడంతో షర్మిల దీనిపై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో... చెల్లికి వాటాల్లేవు, తల్లికి షేర్లు లేవు అంటూ గతనెల 9వ తేదీన జగన్ ఎన్‌సీఎల్టీలో పిటిషన్ వేశారు. ఈ విషయం తెలియగానే షర్మిల మండిపడ్డారు. 12వ తేదీన అన్న జగన్‌కు ఘాటుగా లేఖ రాశారు. తన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడమేమిటంటూ మండిపడ్డారు. ‘ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలన్నది నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్ష’ అని గుర్తు చేశారు. ‘నాన్న ఆశలూ.. ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి మీడియాలోనూ నాకు తీరని ద్రోహం చేశారు. నాన్న కలలో కూడా ఊహించని విధంగా నాపైనా, అమ్మపైనా కేసులు పెట్టారు’’ అంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు. ‘సరస్వతీపవర్‌లో అమ్మకు ఇచ్చిన షేర్లు మీరు రాసిచ్చినవి కావా?’ అని నిలదీశారు. ‘‘ఆస్తులలో నాకు ఎలాంటి హక్కులూ లేకుండా చేయాలన్న మీ దుర్బుద్ధి అర్థమైంది. మీరు ఎన్ని చేసినా నా ప్రయాణాన్ని అడ్డుకోలేరు’’ అంటూ తన లేఖలో సూటిగా చెప్పారు. ‘నా అభిప్రాయమూ ఇదే’ అంటూ ఈ లేఖపై విజయలక్ష్మి కూడా సంతకం చేయడం గమనార్హం!
ఇదీ సరస్వతీ పవర్ కథ
సరస్వతీ పవర్‌లో జగన్, ఆయన సతీమణి భారతికి కలిపి 47 శాతం వాటా ఉండేది. క్లాసిక్ రియల్టీ, సండూర్ పవర్‌కు కలిపి మరో 52 శాతం.. వైఎస్ విజయలక్ష్మికి ఒక శాతం వాటా ఉండేవి. అయితే... జగన్ దంపతులు తమ వాటా 47 శాతాన్ని తల్లి విజయలక్ష్మికి గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. మిగిలిన 52 శాతం సండూర్, క్లాసిక్ రియల్టీ పేరుతో ఉన్నాయి కాబట్టి... ఆ షేర్లు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారు. అయితే... విజయలక్ష్మి రూ.32 కోట్లు చెల్లించి ఆ షేర్లు కొనుగోలు చేశారు. దీంతో... సరస్వతీ పవర్ మొత్తం విజయలక్ష్మికి బదిలీ అయినట్లే. దీనిని సరస్వతీ పవర్ సంస్థ బోర్డు సమావేశం కూడా ఆమోదించింది. అయితే... అందులో నుంచి తన కుమార్తె అయిన షర్మిలకు వాటా ఇవ్వాలని విజయలక్ష్మి భావించారు. దానిని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘నేను నీకు గిఫ్టుగా ఇచ్చిన వాటాలను షర్మిలకు ఇవ్వడమేమిటి?’ అనేది ఆయన ప్రశ్న. సండూర్ పవర్, క్లాసిక్ రియల్టీ షేర్లను విజయలక్ష్మి రూ.32 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆ విషయాన్ని జగన్ దాచిపెట్టారు. ట్రైబ్యునల్‌ను కూడా తప్పుదారి పట్టించేలా... తల్లీ, చెల్లిపై కేసు వేశారు.
రచ్చకెక్కిన రగడ
వైఎస్ కుటుంబంలో వివాదాలు బహిరంగ రహస్యమే అయినప్పటికీ... ఆస్తుల విషయంలో ఇప్పటిదాకా రచ్చకెక్కలేదు. ఇప్పుడు తల్లీ చెల్లిపై జగన్ ఏకంగా ఎన్‌సీఎల్టీలో కేసు వేశారు. పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్న సంగతి బయటపడింది. మరీ ముఖ్యంగా సరస్వతీ పవర్ విషయంలో తనను ట్రైబ్యునల్‌కు లాగడంపై షర్మిల తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలిసింది. ‘‘ఈ విషయంలో నాకు సంబంధమేమిటి? మా అమ్మకు గిఫ్ట్‌డీడ్‌గా వాటాలు రాసిచ్చింది జగన్ దంపతులే కదా! మధ్యలో నన్ను ఎందుకు బద్నాం చేస్తున్నారు’’ అని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పైగా... తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరువును షర్మిల బజారుకీడుస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. దీనిపైనా షర్మిల తీవ్రంగా స్పందిస్తున్నారు. తల్లిపైనే పిటిషన్ వేసిందెవరు? తండ్రి పరువు తీస్తున్నదెవరు. అని ప్రశ్నిస్తూ... ఆస్తుల పంపిణీకి సంబంధించి తొలి నుంచీ ఆడుతున్న ‘జగన్నాటకాన్ని’ బయటపెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రేపోమాపో దీనిపై ఆమె బహిరంగంగానే నోరు విప్పే అవకాశం కనిపిస్తోంది.
రాయ‘బేరానికి’ కారణం!?
ఎన్‌సీఎల్టీలో జగన్ పిటిషన్, తల్లి విజయలక్ష్మినీ అందులో చేర్చడం, అన్నా చెల్లెళ్ల మధ్య లేఖాస్త్రాలు, ఇతర పరిణామాలతో వైఎస్ కుటుంబ శ్రేయోభిలాషులు కలత చెందారు. తల్లీ చెల్లితో గొడవ వద్దని... జగన్‌కు వీరు సర్దిచెప్పినట్లు తెలిసింది. దీంతో... తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లితో రాజీకి జగన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బెంగళూరు ప్యాలెస్ వేదికగా పలువురితో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. జగన్ ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్ వచ్చేనెల 8వ తేదీన విచారణకు రానుంది. ఈ లోపే ఆస్తి పంపకాల్లో రాజీ కుదిర్చి, రచ్చకు తెరదించాలని వైఎస్ కుటుంబ శ్రేయోభిలాషుల యోచన! కానీ... జగన్ వైఖరిపై షర్మిల తీవ్రంగా మండిపడుతుండటంతో వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయన్నది సందేహాస్పదంగా మారింది.
Updated Date - Oct 24 , 2024 | 02:54 AM