ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీజీహెచ్‌లో జగన్‌ రచ్చ

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:11 AM

రౌడీషీటర్‌ దాడిలో మృతి చెందిన యువతి సహన కుటుంబసభ్యుల పరామర్శకు వచ్చిన మాజీ సీఎం జగన్‌ పర్యటన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రచ్చరచ్చగా మారింది. పరామర్శకు వెళుతున్నామన్న కనీస స్పృహ లేకుండా.. వందలాదిమంది

భారీగా కార్యకర్తలతో రాక

ఆస్పత్రి పరిసరాల్లో వైసీపీ శ్రేణుల హల్‌చల్‌

మార్చురీ వద్ద సైతం సీఎం..సీఎం..నినాదాలు

గేటు దూకి, మొక్కలను తొక్కి.. బీభత్సం

గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ దాడిలో మృతి చెందిన యువతి సహన కుటుంబసభ్యుల పరామర్శకు వచ్చిన మాజీ సీఎం జగన్‌ పర్యటన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రచ్చరచ్చగా మారింది. పరామర్శకు వెళుతున్నామన్న కనీస స్పృహ లేకుండా.. వందలాదిమంది కార్యకర్తలతో ఆయన జీజీహెచ్‌కు వచ్చారు. అత్యుత్సాహంతో కార్యకర్తలు రెచ్చపోయారు. జై.. జగన్‌ అని నినాదాలు చేస్తూ.. ఆస్పత్రి లోపల, వెలుపల హల్‌చల్‌ సృష్టించారు. సీఎం సీఎం అంటూ కేకలు, అరుపులతో హోరెత్తించారు. మూసిన ఆస్పత్రి గేట్లు ఎక్కి కొందరు లోపలకు దూకారు. మరికొందరు ఆస్పత్రి లోపల ఏర్పాటుచేసిన మొక్కలను, చెట్లను తొక్కి నాశనం చేశారు. జగన్‌ ఆస్పత్రిలో ఉన్నంత సేపు.. ఆస్పత్రి వెలుపల వైసీపీ కార్యకర్తల అరాచకపర్వం కొనసాగింది. ఆస్పత్రిలోకి వెళ్లే ప్రధాన ద్వారానికి అడ్డంగా నిలబడ్డారు. బయటకు వెళ్లే వాహనాలు, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు. దీంతో సామాన్య రోగులు, వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు.

రోగులకు తప్పని ఇబ్బందులు

మాజీ సీఎం జగన్‌ రాక సందర్భంగా ఉదయం 9 గంటల నుంచే ఆస్పత్రి ప్రధాన ద్వారం మూసివేశారు. తన పర్యటన ముగించుకొని ఆయన మధ్యాహ్నం 12.15 గంటలకు బయటకు వెళ్లే వరకు బయట వారిని లోనికి, లోపల వారిని బయటకు అనుమతించ లేదు. మెయిన్‌ గేటు పక్కనే అత్యవసర వైద్య విభాగం క్యాజువాల్టీ ఉంది. ఎమర్జెన్సీ కేసుల్లో క్యాజువాల్టీకి వచ్చే రోగులకు మూడు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. క్యాజువాల్టీకి వెళ్లే దారి వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోవడమే దీనికి కారణం. ఆస్పత్రిలోకి వచ్చిన రోగులు వార్డులోకి వెళ్లలేక 108 ఆంబులెన్స్‌ వాహనాల్లో చాలాసేపు ఉండిపోయారు. కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో సహన కుటుంబం ఉంటే జగన్‌ అనుచరులు మార్చురీ వద్ద కూడా సీఎం... సీఎం అంటూ నినాదాలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా, జగన్‌ పర్యటనలో సందిట్లో సడేమియాగా కొందరు జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. కొందరి జేబులకు కత్తెర వేశారు. ఇదిలాఉండగా, బాధిత యువతికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కొందరు జై భీమ్‌ కార్యకర్తలు జీజీహెచ్‌ ఎదుట కొద్దిసేపు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రిలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలాఉండగా, అంతమంది వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి రావడం చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తం కాలేదు. వారిని అదుపు చేయడంలో వైఫల్యం చెందారు. జగన్‌ వెంట ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, తలశిల రఘురామ్‌, వరుదు కళ్యాణి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తదితరులు ఉన్నారు.


మహిళలకు రక్షణ లేదు

నాలుగున్నర నె లల్లో 77 అత్యాచారాలు

నిందితులంతా టీడీపీ నాయకులే అందుకే ఎవరిపైనా చర్యలు లేవు: జగన్‌

గుంటూరు మెడికల్‌, బద్వేలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుచేస్తోందన్నారు. తెనాలిలో రౌడీషీటర్‌ దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించిన సహన అనే యువతి భౌతికకాయాన్ని ఆస్పత్రిలో చూడటానికి వెళ్లినప్పుడు, ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన బాలిక కుటుంబాన్ని బద్వేలులో పరామర్శించిన సమయంలో బుధవారం జగన్‌ మీడియాతో మాట్లాడారు. పరామర్శకు వెళ్లిన ఆయన.. ఆ రెండు చోట్లా రాజకీయ విమర్శలకు లంఘించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, లోకేశ్‌ను ఉద్దేశించి ఏకవాక్య ప్రయోగం చేస్తూ, తిట్ల దండకం వినిపించారు. మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు కళ్లెదుటే కనిపిస్తున్నా నిందితులపై ఎటువంటి చర్యలు లేవన్నారు. నిందితులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడమే దీనికి కారణమని, సహన హంతకుడు నవీన్‌ కూడా టీడీపీకి చెందిన వ్యక్తేనని ఆరోపించారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో 77 అత్యాచారాలు జరిగాయి. ఏడుగురు మహిళలు హత్యకు గురయితే, మరో ఐదు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాధితుల కుటుంబాలను సీఎం చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు కోరాలి. తక్షణం రూ.10 లక్షల సాయం ప్రకటించాలి. వైసీపీ తరఫున సహన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తాం’’ అని జగన్‌ తెలిపారు.

వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?

నాడు తాను తెచ్చిన మహిళలకు దిశ యాప్‌ రక్షణగా నిలిచిందని జగన్‌ అన్నారు. ‘‘దిశ యాప్‌ను మంత్రులు లోకేశ్‌, అనిత తగులబెట్టారు. వారికి బుద్ధి, జ్ఞానం లేవు. సీఎం చంద్రబాబు....చరిత్రహీనుడౌతారు’’ అంటూ జగన్‌ దూషణలకు దిగారు. కాగా, బద్వేలులో ఘటన శనివారం జరిగితే ఇప్పటివరకు పట్టించుకున్నవారు లేరని, తాను వస్తున్నానని తెలిసి బుఽధవారం బాలిక కుటుంబానికి సహాయం అందించారని జగన్‌ ఆరోపించారు. ఇలాగే పరిపాలన కొనసాగితే చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే పరిస్థితి వస్తుంది. ’’ అని జగన్‌ అన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 04:11 AM