Gaja..gaja in Peeleru... : పీలేరులో గజ..గజ...
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:40 PM
ఆవులను మేతకు తోలుకెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. పీలేరు మండలంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
రైతుపై ఏనుగుల గుంపు దాడి
అక్కడికక్కడే మృతి చెందిన రైతు
ఇందిరమ్మ కాలనీ వద్ద ఘటన
మామిడి తోటలో తిష్టవేసిన 16 ఏనుగుల గుంపు
చిన్న రాజారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే నల్లారి
భయాందోళనలో ఇందిరమ్మ కాలనీ వాసులు
ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది తంటాలు
పీలేరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆవులను మేతకు తోలుకెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. పీలేరు మండలంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. కాకులారంపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన రైతు మోపిరెడ్డి చిన్న రాజారెడ్డి (62) ప్రతిరోజూలాగే ఉదయాన్నే తన ఆవులను మేత కోసం తన తోట వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే తోటలో ఉన్న 16 ఏనుగుల గుంపు రైతును తమ తొండాలతో నలిపి చంపేశాయి. దీంతో పీలేరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పీలేరు మండలానికి పొరుగున ఉన్న పులిచెర్ల, సదుం మండలాల్లో దాదాపు రెండేళ్లుగా ఏనుగుల సంచారం ఉంది. అవి పలమనేరు అటవీ ప్రాంతం నుంచి సోమల మీదుగా సదుం మండలంలో, అటు నుంచి పులిచెర్ల మండలంలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తొలిసారిగా అవి పులిచెర్ల మండలం నుంచి పీలేరు మండలంలోకి ప్రవేశించాయి. పంట పొలాలపై పడి తీవ్రమైన ఆస్తి, పంట నష్టం కలిగిస్తుండడంతో పులిచెర్ల ప్రాంతంలోని అటవీ సిబ్బంది రాత్రింబవళ్లు వాటిని అటవీ ప్రాంతాల వైపు మళ్లించేందుకు శ్రమిస్తున్నారు. అయితే అవి దారి తప్పి పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని మామిడి తోటల్లోకి ప్రవేశించాయి.
సంఘటనా స్థలంలో చిన్న రాజారెడ్డి మృతదేహం
ఈ విషయం తెలియని రైతు రాజారెడ్డి మంగళవారం ఉదయం 8 గంటలకు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని తన పంట పొలాల వద్దకు ఆవులను మేత కోసం తీసుకెళ్లాడు. ఏనుగులను చూసి బెదిరిన ఆవులు ఒక్కసారిగా పరుగెత్తాయి. ఆవులు బెదరడం గమనించిన చిన్న రాజారెడ్డి వాటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో గుబురుగా ఉన్న చెట్లు, పొదల్లో ఉన్న ఏనుగులు అతడిని చుట్టుముట్టి చంపి పక్కనే ఉన్న పీలేరు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు యల్లెల రెడ్డప్పరెడ్డి తోటలోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన చిన్న రాజారెడ్డి తోట పక్కన ఉన్న ఇతర రైతులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలాన్ని చేరుకునేటప్పటికే ఆయన విగతజీవుడై పడి ఉన్నాడు. పోలీసులు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్న రాజారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న రాజారెడ్డికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఏనుగుల దాడిలో రైతు మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పోలీసులు, ఫారెస్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆయన కుటుంబానికి రావాల్సిన పరిహారాన్ని అందించడంతో పాటు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని ఆయన కలెక్టర్ చామకూరి శ్రీధర్, డీఎ్‌ఫవో జగన్నాథ్‌సింగ్‌లను ఫోనులో కోరారు.
అప్రమత్తమైన ఫారెస్టు, పోలీసు అధికారులు
ఏనుగులు రైతుపై దాడి చేసి చంపేయడం, ఇందిరమ్మ కాలనీ సమీపంలోని తోటలో తిష్ట వేయడంతో ఫారెస్టు, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుంచి రైతు మృతదేహాన్ని తరలించిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకుని కాలనీకి దారి తీసే దారులన్నంటినీ మూసివేశారు. స్థానికులను కట్టడి చేయడంతో పాటు ఫారెస్టు అధికారులతో సమన్వయం చేసుకుని ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వర్షం కురుస్తుండడం, ఏనుగులు తోటలో నుంచి బయటకు రాకపోవడంతో, చిత్తూరు, పలమనేరు ప్రాంతం నుంచి ట్రాకర్స్ రావడం ఆలస్యం కావడంతో ఏనుగుల మళ్లింపు కోసం మంగళవారం రాత్రి వరకు వేచి చూడాల్సి వచ్చింది.
రూ.10 లక్షల పరిహారం అందజేస్తాం
మదనపల్లె సబ్ డీఎ్‌ఫవో శ్రీనివాసులు
ఏనుగుల దాడిలో మరణించిన చిన్న రాజారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్ డీఎ్‌ఫవో శ్రీనివాసులు ప్రకటించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్న రాజారెడ్డి మృతదేహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల దాడిలో రైతు మరణించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు పలమనేరు, సోమల, సదుం, పులిచెర్ల మండలాలకు పరిమితమైన ఏనుగుల సంచారం పీలేరు మండలంలోనూ కనిపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే పీలేరులో కనిపించిన గుంపులో గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని, పిల్లలను కాపాడుకునే క్రమంలో అవి ఒక్కోసారి మనుషుల మీద దాడి చేస్తుంటాయని, చిన్న రాజారెడ్డి ఉదంతం కూడా అటువంటిదేనన్న అనుమానం ఉందన్నారు. ఏనుగుల సంచారం, వాటి కట్డడి గురించి పీలేరు ప్రాంతంలోని అటవీ శాఖ సిబ్బందికి తగిన అనుభవం లేదని సదుం, పులిచెర్ల, చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లోని సిబ్బంది, ట్రాకర్ల సాయంతో వాటిని మళ్లీ అటవీ ప్రాంతంలోకి మళ్లిస్తామన్నారు.
సోలార్ ఫెన్సింగ్ పూర్తి చేసేందుకు కృషి చేస్తాం
చిన్న రాజారెడ్డి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
ఏనుగుల బెడదను నివారించేందుకు అసంపూర్తిగా మిగిలిపోయిన సోలార్ ఫెన్సింగ్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏనుగుల దాడిలో మరణించిన రైతు చిన్న రాజారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరపున అందిన రూ.5 లక్షల పరిహారం చెక్కును మంగళవారం సాయంత్రం ఆయన అన్నమయ్య డీఎ్‌ఫవో జగన్నాథ్ సింగ్‌తో కలిసి చిన్న రాజారెడ్డి సతీమణి సరస్వతమ్మకు అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాల విభజన కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా సోలార్ ఫెన్సింగ్ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని త్వరలో జరగబోయే టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్నారు. ఏనుగుల దాడిలో మరణించిన చిన్న రాజారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం మంజూరైందని, తొలి విడతగా రూ.5 లక్షల చెక్కును అందజేశామని, త్వరలోనే మిగిలిన రూ.5 లక్షలను ఆమె ఖాతాలో జమ చేస్తామన్నారు. ఏనుగులు తిష్ట వేయడం వల్ల మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు యల్లెల రెడ్డప్ప రెడ్డి మామిడి తోటకు అపార నష్టం వాటిల్లిందని, ఆయనకు పరిహారం లభించేలా చూడాలని ఎమ్మెల్యే, డీఎ్‌ఫవోకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటపల్లె బాబు రెడ్డి, లడ్డూ జాఫర్, యల్లెల రెడ్డప్ప రెడ్డి, బాబు రెడ్డి, పురం రామ్మూర్తి, లక్ష్మీకర, చిన్న రెడ్డప్ప రెడ్డి, రహంతుల్లా, శేఖర, తదితరులు పాల్గొన్నారు.
సదుం వైపు కదిలిన గజరాజులు
మామిడి తోటలో తిష్ట వేసిన ఏనుగులు ఎట్టకేలకు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కదిలాయి. అటవీ శాఖ సిబ్బంది సాయంత్రం 6 గంటల నుంచి టపాకాయలు కాల్చారు. దీంతో అవి నెమ్మదిగా తోటలో నుంచి బయటకు అడుగులు వేశాయి. వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది వాటి గుంపుకు ఇరువైపులా పెద్దఎత్తున బాణాసంచా కాల్చుతూ అవి వెళ్లాల్సిన వైపు కాల్చకపోవడంతో అవి సదుం ప్రాంతం వైపు కదిలాయి. పీలేరు మండలంలోని చిన్న గాండ్లపల్లె, నూనేవాండ్లపల్లె, ఆ తరువాత సదుం మండలంలోని తాటిగుంటపాళెం మీదుగా సదుం మండలంలోని బూరగమంద, చీకలచేను ప్రాంతంలోని దట్టమైన అడవులవైపు వాటిని మళ్లించారు. వాటి కదలికలను గమనిస్తూ, వాటి గమనం తప్పకుండా ట్రాకర్స్ వాటిని వెంబడించారు. కార్యక్రమాన్ని అటవీ శాఖ తిరుపతి సీసీఎఫ్ శరవణన్, చిత్తూరు జిల్లా డీఎ్‌ఫవో భరణి, అన్నమయ్య జిల్లా డీఎ్‌ఫవో జగన్నాథ్ సింగ్, మదనపల్లె సబ్-డీఎ్‌ఫవో శ్రీనివాసులు పర్యవేక్షించారు. పీలేరు, మదనపల్లె బీట్‌లలోని సిబ్బంది వేణుగోపాల్, సబిహా సుల్తానా, రెడ్డి ఆశియాబీ, చంద్రకళ, జగదీశ్, శ్రీనివాసన్, గిరి, సుధాకర్, షాజహాన్, శోభారాణి, రామ్మోహన్, దీప, జ్యోతి విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏనుగుల గుంపులో నాలుగు గున్న ఏనుగులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఏనుగుల గుంపు పులిచెర్ల మండలం నుంచి వచ్చినట్లు ఫారెస్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణ చేశారు. పులిచెర్ల మండలంలోని రామిరెడ్డిగారిపల్లె మీదుగా ప్రయాణించిన ఆ గుంపు పీలేరు-చిత్తూరు మార్గంలోని ఎంజేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారి దాటి ఇందిరమ్మ కాలనీవైపు వచ్చి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.
Updated Date - Oct 15 , 2024 | 11:40 PM