విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:38 AM
విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్ మెయిల్..
ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన తోటి విద్యార్థి
స్నేహితుడి గదికి తీసుకువెళ్లి అఘాయిత్యం
పథకం ప్రకారం వీడియో తీసిన ముగ్గురు స్నేహితులు
ఆ వీడియోలతో బెదిరించి సామూహిక అత్యాచారం
తరచూ కలవాలన్న బెదిరింపులతో బాధితురాలి
ఆత్మహత్యాయత్నం.. దాంతో అకృత్యం వెలుగులోకి
పోలీసులకు ఫిర్యాదు.. నిందితుల అరెస్టు
విశాఖపట్నం, మహరాణిపేట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గాజువాక ప్రాంతానికి చెందిన బాధిత యువతితోపాటు వన్‌టౌన్ రంగిరీజు వీధికి చెందిన బాత వంశీ, జాలారిపేటకు చెందిన బొడ్డు జగదీశ్, కృష్ణాగార్డెన్స్‌కు చెందిన పోలిపల్లి ఆనంద్, చేపలుప్పాడకు చెందిన దవులపల్లి రాజేష్ నగర శివారులోని ఒక కళాశాలలో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతున్నారు. బాధిత యువతికి వంశీ ప్రేమ పేరుతో చేరువై పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ఆమె ఒప్పుకోవడంతో ఆగస్టు 13న యువతికి ఫోన్ చేసి డాబాగార్డెన్స్‌కు రావాలని కోరాడు. ఆమె వచ్చాక, టూటౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న పోలిపల్లి ఆనంద్ రూమ్‌కు తీసుకువెళ్లాడు. వంశీ ఇచ్చిన సమాచారం మేరకు బొడ్డు జగదీశ్ వారిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియోలో చిత్రీకరించాడు. జగదీశ్ ఆ వీడియోను వంశీకి షేర్ చేయగా, వంశీ ఆ వీడియోను ఆనంద్, రాజే్‌షకు షేర్ చేశాడు.
వారంతా ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించి పలుమార్లు సామూహికంగా అత్యాచారం చేశారు. ఇంకా తమతో గడపాలంటూ వేధిస్తుండడంతో బాధితురాలు 18న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేశారు. పార్ట్ టైమ్‌గా వంశీ, జగదీశ్‌లు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గాను, ఆనంద్ ఒక కంపెనీలో క్యాషియర్‌గా, రాజేష్ రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: మంత్రి డోలా
గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు.
Updated Date - Nov 20 , 2024 | 03:38 AM