Amaravati: అమరావతి వైభవం!
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:45 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది.
ఐదేళ్లు ఆగిన మాస్టర్ ప్లాన్‌కు తిరిగి ప్రాణం
కృష్ణా నదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జీల నిర్మాణం
‘‘130 సంస్థలకు గతంలోనే అమరావతిలో స్థలాలు కేటాయించాం. ఆ సంస్థల పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలి. దానికోసం ఆ సంస్థల ప్రతినిధులతో నేను మాట్లాడతాను. వారిలో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు.. ఎవరు ఇన్ యాక్టివ్‌గా ఉన్నారనేది తెలుసుకుంటా. ఉత్సాహంగా ముందుకొచ్చే సంస్థలకు మరో చాన్స్ ఇస్తా. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు మరో రెండేళ్లపాటు గడువు పొడిగిస్తున్నాం. దేశంలోనే టాప్ 10లో ఉన్న కాలేజీలు, ఆస్పత్రులు రాజధానికి వచ్చేలా ప్రయత్నించాలి. బిట్స్ పిలాని లాంటి సంస్థలతో మాట్లాడాలి’’
- చంద్రబాబు
కరకట్టపై సెంట్రల్ డివైడర్‌తో 4 లైన్ల రోడ్డు
ఇన్నర్, ఔటర్ రింగ్‌లు, ఈస్ట్రన్, వెస్ట్రన్ బైపా్‌సలు
రాజధానిలో నిర్మాణ పనులు ఇక పరుగులు
టాప్ 10 కాలేజీలు, ఆస్పత్రులు వచ్చేలా కృషి
సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు
అందుకు కలిసొచ్చే సంస్థలకే భూములు
గతంలో భూములు తీసుకున్న సంస్థలతో
మాట్లాడతా.. యాక్టివ్‌గా ఉంటే మరో చాన్స్
సీఆర్డీయే పరిధి యథాతఽథం
రైతులకు కౌళ్లు, భూమిలేని కూలీలకు పింఛన్లు
మరో ఐదేళ్ల పాటు పొడిగింపు
ఆఫీసులపై సంస్థలకు మరో రెండేళ్ల గడువు
సీఆర్డీయేతో భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయం
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధాని పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని కొత్త సర్కారు నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సీఆర్డీయే 36వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 12 అంశాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి....ఎవరికి భూములు కేటాయించాలి అనే అంశంపైనా ముఖ్యమంత్రి చర్చించారు. దేశంలోని టాప్ 10లోని కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలోనే ఏర్పాటు కావాలన్నారు. కరకట్టపై సెంట్రల్ డివైడర్‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై నాలుగు బ్రిడ్జీలు ఐకానిక్‌గా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్ బ్రిడ్జిపై మరోసారి అధ్యయనం చేస్తామని తెలిపారు. సమీక్ష వివరాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మీడియాతో పంచుకున్నారు. ఆయన తెలిపిన ప్రకారం ఈ సమీక్షలో చంద్రబాబు పేర్కొన్న విషయాలివి...
పనులు వేగవంతం...
‘‘కోర్ క్యాపిటల్ సిటీ పరిధి 217 చదరపు కిలోమీటర్లు. సిటీలో తూర్పు నుంచి పడమరకు ఒక రహదారి గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తాం. ప్రతి కిలోమీటర్‌కు ఒక రోడ్డు ఉంటుంది. ఇందులో ఈ-5, 11, 13, 15 రోడ్లను నేషనల్ హైవేకు కలిపేలా చర్యలు తీసుకుంటాం. ఒక సంవత్సరంలో వాటిని పూర్తి చేస్తాం. కొండలు ఉన్న చోట వాటి పక్క నుంచి ఈరోడ్లను నేషనల్ హైవేకు కలపాలి. అమరావతిలో నిర్మించే ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మిస్తాం. ఇప్పటికే నదిపై రెండు సాధారణ బ్రిడ్జీలు ఉండగా, మరొకటి త్వరలో అందుబాటులోకి వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రం నిర్మిస్తే, ఇన్నర్‌ను మన ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతిలో వెస్ట్రన్, ఈస్ట్రన్ బైపా్‌సలు వస్తున్నాయి. ఇప్పటికే చేపట్టిన ఈస్ట్రన్ బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి అవుతుంది’’
సంపద కేంద్రంగా అమరావతి..
‘‘గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలి. గతంలో ల్యాండ్ పొందిన వాళ్లు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనేది స్పష్టత ఉండాలి. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూ కేటాయింపులు జరపాలి. గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్షించి, ఆసక్తి చూపే సంస్థలకే అవకాశం ఇవ్వాలి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై ముందుకెళ్లాలి. భూసమీకరణకు సహకరించి భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును, భూమి లేని రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లు పొడిగించాలి. గతఐదేళ్ల కాలంలో రైతులు పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈనిర్ణయం తీసుకున్నాం. వారికి ఇచ్చే మొత్తంలోనూ మార్పు ఏమీ లేదు’’
తిరిగి హ్యాపీ నెస్ట్
‘‘రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరో రెండేళ్లపాటు గడువును పొడిగించాం. సోమ, మంగళవారాల్లో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అవుతాయి. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. గతంలో సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియమించగా, ఇప్పుడు 249 మంది ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన వారిని కూడా తీసుకునేందుకు అనుమతించాం. గతంలో సీఆర్డీఏ కోసం 47 మంది కన్సల్టెంట్లను తీసుకున్నాం. వారిలో 15 మంది కన్సల్టెన్సీల పనులు పూర్తి కాగా, మిగిలిన వారిని అథారిటీకి తీసుకొంటాం’’
సీఆర్డీఏ పరిఽధిలో మార్పులేదు..
‘‘8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీయే ఉండేలా గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండదు. ఆ పరిధిని గత ప్రభుత్వం 6993.24 చదరపు కిలోమీటర్లకు కుదించింది. అయితే పాతవిధానమే కొనసాగుతుంది. సీఆర్డీఏ నుంచి ఎక్కువ భాగం తీసేసి గత ప్రభుత్వం . పల్నాడు, బాపట్ల అథారిటీలు ఏర్పాటుచేసింది. ఆ అథారిటీలు ఉంటాయి. కానీ వాటిలోని సీఆర్డీఏ భాగాన్ని వెనక్కి తీసుకొంటాం’’’
ఆ గ్రామాలు మళ్లీ కోర్ క్యాపిటల్‌కు..
గతంలో కోర్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఉండేలా మాస్టర్ ప్లాన్‌ను తయారుచేశాం. ఇందులో 54 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాలుగు గ్రామాలను గత ప్రభుత్వం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. మాస్టర్ ప్లాన్‌ను గందరగోళానికి గురిచేసింది. మేం దాన్ని తిరిగి సరిచేశాం. ఆ నాలుగు గ్రామాలను తిరిగి కోర్ క్యాపిటల్‌లో కలుపుతున్నాం. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు మేం చర్చలు జరుపుతాం. అమరావతిలో నిర్మాణంలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల పటిష్టతను పరిశీలించాలని హైద్రాబాద్ ఐఐటీని కోరాం’’
కరకట్ట రోడ్డు నాలుగులైన్లు.,..
కరకట్టపై సెంట్రల్ డివైడర్‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణాన్ని ్ఠగతంలో మేం ప్రతిపాదించాం. అయితే, గత ప్రభుత్వం ఆ రోడ్డును రెండు లైన్లకు కుదించింది. గతంలో నిర్ణయించినట్లుగానే కరకట్ట రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపడతాం. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే కరకట్ట రోడ్డు అంత వరకు ఉంటుంది. గతంలో మేం దీనిపై టెండర్లు పిలిచాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వాటికి తిరిగి టెండర్లు పిలుస్తాం. కేంద్రప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు నిర్మించుకునేలా చూడాలని రాష్ట్ర ఎంపీలందరికీ సంస్థల వారీగా బాధ్యతలు అప్పగించాలి. ఆర్-5 జోన్ విషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో లీగల్ గా అధికారులు దానిపై అధ్యయనం జరపాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.
Updated Date - Aug 03 , 2024 | 07:13 AM