Google: ఏపీకి గూగుల్
ABN, Publish Date - Dec 12 , 2024 | 04:33 AM
ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది.
విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
రాష్ట్రానికి ఏఐ సేవలు.. చంద్రబాబు, లోకేశ్‌తో బృందం భేటీ
ఐటీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం: బాబు
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. విశాఖపట్నంలో గూగుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీజీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వికాశ్ కోలే బృందం సమావేశమైంది. చంద్రబాబు, లోకేశ్ సమక్షంలోఒప్పందాలపై సంతకాలు చేశారు. పెట్టుబడులు ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నారు, విశాఖ సహా రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ఎక్కడెక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వికాస్ వెల్లడించారు. ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ చేసుకున్న ఒప్పందం, ఆ తర్వాత విశాఖలో వికాస్ పర్యటన గురించి చర్చ జరిగింది.
అమెరికా పర్యటనలో గూగుల్‌ను మంత్రి లోకేశ్ సందర్శించడం, రాష్ట్రానికి ఏఐ సేవలు అందించాలంటూ ఆహ్వానించడం వంటి అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని వికాస్ వెల్లడించారు. మంత్రి లోకేశ్, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌తో జరిపిన సంప్రదింపుల తర్వాత రాష్ట్రంతో వ్యూహాత్మకంగా కలసి ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో గూగుల్ కార్యకలాపాలను చేపట్టడం, అందునా విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. రిలయన్స్, నిప్పాన్ స్టీల్స్, భారత్ ఫోర్బ్స్, టాటా గ్రూప్ వంటి సంస్థలు రాష్ట్రానికి రావడంపై చర్చ సాగింది.
ఐటీ అత్యంత ప్రభావశీలి: చంద్రబాబు
భారత్‌లో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాల గురించి గూగుల్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. ఐటీ రంగానికి ఆర్థికంగానూ, సామాజికంగా ప్రభావం చూపే శక్తి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక, సామాజికాభివృద్ధిలో ఐటీ రంగం కీలకమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఐటీ రంగాన్ని విస్తరిస్తే వచ్చే ప్రయోజనాలను గ్రహించానని అన్నారు. ఐటీని ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని వెల్లడించారు. ప్రపంచమంతా ఐటీ రంగంవైపు చూస్తోందని, విశ్వంలో ఐటీ అత్యంత ప్రభావశీలిగా మారిందన్నారు.
Updated Date - Dec 12 , 2024 | 07:55 AM