CM Chandrababu: జగన్ సిగ్గుందా.. చంద్రబాబు మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 07 , 2024 | 01:30 PM
చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ దుర్మార్గ పాలనతో రాష్ట్రం వెనకబడిందన్నారు. వైసీపీ పాపాలకు జనం బలవుతున్నారన్నారు. జగన్ చేసిన పాపాలకు బదులుగా ఓటర్లు ఎన్నికల్లో వాతలు పెట్టి ఇంటికి పంపించారన్నారు. దుర్మార్గులకు అధికారం ఇవ్వడమే ప్రజలు చేసిన..
ఐదేళ్లు సీఎంగా జగన్ చేసిన పాపాలతో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ దుర్మార్గ పాలనతో రాష్ట్రం వెనకబడిందన్నారు. వైసీపీ పాపాలకు జనం బలవుతున్నారన్నారు. జగన్ చేసిన పాపాలకు బదులుగా ఓటర్లు ఎన్నికల్లో వాతలు పెట్టి ఇంటికి పంపించారన్నారు. దుర్మార్గులకు అధికారం ఇవ్వడమే ప్రజలు చేసిన తప్పన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని, దీంతో కేంద్రం నిధులు ఇవ్వని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ అరాచక పాలనతో పోలవరం వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో రహదారులను గోతుల మయం చేశారన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి గత వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి విద్యుత్తు ఛార్జీలు పెరగవని తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే ఇటీవల విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం 400 కేవీ విద్యుత్ సరఫరా లైన్లు శాశ్వత మళ్లింపు పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేదుకు రూ.505 కోట్లతో నిర్మించిన జీఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను చంద్రబాబు ప్రారంభించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5407 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. సీఆర్డీయే పరిధిలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తాళ్ళాయాపాలెంలో 400 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. ఆర్థిక అభివృద్ధి సాధించడంలో 24x7 గంటలు విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించనుంది.
రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం క్రమక్రమంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలో తాళ్లాయపాలెంలో 400/220 కెవి గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సర్కార్ నిర్మించింది. ఈ కేంద్రాన్ని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తాళ్లాయపాలెంలో ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి కరెంట్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం నిర్మించిన 400/220 విద్యుత్ కేంద్రంతో పాటు నేలపాడులో 220/33 కేవీ విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. వీటి ద్వారా రాజధాని ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 07 , 2024 | 01:32 PM