చెట్లను కాపాడితే పర్యావరణ పరిరక్షణ
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:01 AM
ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు.
జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం
బాపట్ల, ఆగస్టు 30 : ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. బాపట్ల మండలం సూర్యలంకరోడ్డులోని ముత్తాయపాలెం వనంలో నిర్వి హంచిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావు, డిఆర్‌వో సి.హెచ్.సత్తిబాబు, ఆర్డీవో గంధం రవీందర్, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఔషద మొక్కలను కలెక్టర్ చేతులమీదగా విద్యార్ధులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అటవీసంపద పెరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భూభాగంలో కనీసం 33శాతం అటవీ సంపద ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నప్పటికి అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయటం మంచిది కాదన్నారు. ప్రస్తుతం 20శాతం చెట్లు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క తప్పనిసరిగా నాటాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటతామని, నవంబరులో కార్తీక వన సమారాధన వరకు మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగించాలని చెప్పారు. లక్ష్యం మేరకు రహదార్లు, కాల్వలు వెంట ప్రభుత్వకార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటాలన్నారు. హైదరాబాద్‌లో 2వేల అడుగుల లోతుగా బోరువేసిన నీరు అందే పరిస్థితి లేదన్నారు. బెంగుళూరులో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ రాకూడదన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి బివి.రమణరావు, డిప్యూటీ రేంజ్ అధికారి వై.బాలకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ వై.పిచ్చిరెడ్డి, డిఎమ్ అండ్ హెచ్‌వో డాక్టర్ ఎస్.విజయమ్మ, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి సి.హెచ్.సువార్త, సాంఘిక సంక్షేమశాఖ ఏడి జె.రాజాదెబోరా, ఉద్యాన వనశాఖాధికారిణి జెన్నెమ్మ, తహసీల్దార్ శ్రీదేవి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:01 AM