పింఛన్ అనర్హుల ఏరివేత
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:14 AM
జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు--2 గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి తనిఖీ పూర్తి చేశారు.
అర్హత లేకపోయినా పింఛన్ లబ్ధ్ది పొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వారిని గుర్తించే పనిని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాలో ఇప్పటికే ఓ సచివాలయ పరిధిలోని ఇళ్లను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి తనిఖీలు సైతం పూర్తి చేశారు. ఈ తనిఖీలలో భాగంగా పలు అంశాలు అధికారులు దృష్టికి వచ్చాయి. ఇంటి దగ్గర అందుబాటులో లేని వారి విషయంలో ఎటువంటి వైఖరి తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోనున్నారు
(బాపట్ల, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు--2 గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి తనిఖీ పూర్తి చేశారు. ఇక్కడ మొత్తం 476 మంది పింఛన్లు అందుకుంటుండగా 447 మందికి సంబంధించి యంత్రాంగం పింఛన్ అందుకుంటున్న వారి వివరాలను నమోదు చేసి వెరిఫై అంకాన్ని పూర్తి చేసింది. పింఛన్ అందుకుంటున్న 29 మంది అందుబాటులో లేకపోవడంతో వాటిని హోల్డ్‌లో పెట్టి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తం 447 తనిఖీల్లో భాగంగా అనర్హులుగా 18 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరందరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. వారి వివరణ కూడా తీసుకున్న తర్వాతనే పింఛన్ తొలగింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం
జిల్లాలో మొత్తం పింఛన్ దారులు 2,28,615
జిల్లాలో మొత్తం పింఛన్ అందుకుంటున్న వారు 2,28,615 మంది ఉండగా, వీరిలో వితంతువులు 50,270, ఒంటరి మహిళలు 7,864, దివ్యాంగులు 25,892, మిగిలిన వారు ఇతరుల కింద లబ్ది పొందుతూ ఉన్నారు. గడచిన ఐదేళ్లలో అర్హులకు లబ్ది చేకూర్చపోగా రాజకీయ పైరవీలతో ఇబ్బడి ముబ్బడిగా అనర్హులకు మేలు చేసినట్లు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో వెల్లడైంది. గత ప్రభుత్వంలో అనర్హులు పింఛన్ అందుకుంటున్నారంటూ దాదాపు 4,600 ఫిర్యాదులు ఐదేళ్ల వ్యవధిలో వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టకపోగా యధేచ్ఛగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే పనిని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. అప్పుడు వచ్చిన ఫిర్యాదులతో పాటు మొత్తం పింఛన్లనే ఓ సారి తనిఖీలు చేసి అనర్హులను ఏరివేసే ప్రక్రియకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
గతంలోనే ప్రాథమికంగా ఓ అంచనా....
ఇప్పుడు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పూనూరు--2 సచివాలయ పరిధిలో దాదాపు 18 మందిని అనర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఇదే నిష్పత్తిలో జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 2,600 మంది వరకు అనర్హులుగా ఉండి పింఛన్ ఫలాలు అందుకుంటున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే డీఆర్‌డీఏ పింఛన్ల తనిఖీని చేపట్టింది. దీనిలో భాగంగా అప్పట్లో దాదాపు 2,900 వరకు గుర్తించినట్లు సమాచారం. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించిన అనర్హుల శాతంతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు 2,600 మంది అనర్హులు పింఛన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన సచివాలయ పరిధిలో గుర్తించిన అనర్హులతో పాటు ప్రభుత్వం గతంలో గుర్తించిన అనర్హులందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసే ప్రక్రియను యంత్రాంగం చేపట్టనుందని తెలుస్తోంది. గడచిన ప్రభుత్వంలో దాదాపు పదివేల మంది అర్హులు రాజకీయ పరమైన కారణాలతో పింఛన్లకు దూరంగా ఉండిపోయారు. వీరందరి దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం వారందరికీ పింఛన్ ఫలాలు అందేలా చూడడానికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది
రెండు విభాగాల మధ్య సమన్వయం కరువు...
గతంలో పింఛన్లకు సంబంధించిన సమాచారమేదైనా డీఆర్‌డీఏ పీడీ లాగిన్‌కు వచ్చేవి. అలాంటిది ఇప్పుడు సెర్ప్ లాగిన్‌కు వెళ్లడంతో ఇరు విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సచివాలయ పరిధిలోని వెల్‌ఫేర్ అసిస్టెంట్‌కు పింఛన్‌కు సంబంధించిన దరఖాస్తు వస్తుంది. అక్కడ వెరిఫై అనంతరం ఎంపీడీవో లాగిన్‌కు, అక్కడ పరిశీలన ముగిసిన తర్వాత డీఆర్‌డీఏ పీడీ దగ్గరకు, అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ ఆమోదంతో రాష్ట్రస్థాయికి పంపించే వారు. కానీ ఇప్పుడు సెర్ప్ సీఈవో లాగిన్‌కు వెళుతుండడంతో డీఆర్‌డీఏ పాత్ర నామమాత్రంగా మిగిలింది. పింఛన్లకు సంబంధించి వివరాల విషయంలో డీఆర్‌డీఏ సైతం సెర్ప్ మీద ఆధారపడాల్సి రావడం, రెండు విభాగాల సిబ్బంది మధ్య సఖ్యత లోపించడంతో కొంత గందరగోళానికి దారి తీస్తోంది
Updated Date - Dec 24 , 2024 | 01:14 AM