ఉపాధిలో.. మస్టర్ల మాయ
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:01 AM
వలసలను నివారించి.. కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం నుంచి అక్రమార్కులు కాసులు పిండుకుంటున్నారు.
ఫీల్డు అసిస్టెంట్లపై పోలీసులకు నగరం ఎంపీడీవో ఫిర్యాదు
రికార్డులు అపహరించి.. విచారణకు హాజరుకాని సిబ్బంది
రేపల్లె, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వలసలను నివారించి.. కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం నుంచి అక్రమార్కులు కాసులు పిండుకుంటున్నారు. సాంకేతికత ఎంత అందుబాటులో తెచ్చినా అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. కూలీల పేరిట బోగస్ మస్టర్లు వేసి సొమ్ములు కాజేస్తున్నారు. నగరం మండలంలోని ఏడు పంచాయతీల్లో ఏడుగురు ఫీల్డు అసిస్టెంట్లు బోగస్ మస్టర్లు వేసి రూ.4 కోట్లు పక్కదారి పట్టించారని ఆడిట్‌లో వెలుగుచూసింది. అయితే ఈ అవకతవకలు బయటపెట్టకుండా డబ్బుతో అధికారులను లోబరుచుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో ఫీల్డు అసిస్టెంట్లు సంబంధిత రికార్డులతో పరారయ్యారు. ప్రస్తుతం వారు విధులకు రావడం లేదు. ఈ క్రమంలో వారు గ్రామాల్లో అందుబాటులో లేరని ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫీల్డు అసిస్టెంట్లపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ భార్గవ్ కేసు నమోదు చేసి ఫీల్డు అసిస్టెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీవో అరుణ, కంప్యూటర్ ఆపరేటర్లు సుబ్బారావు, ప్రసాద్, టీఏడబ్ల్యూలు రమణ, మురళి, ఆశీర్వాదంలు ఫీల్డు అసిస్టెంట్లకు సహకరించారని అధికారులు తెలిపారు.
వైసీపీ హయాంలో అక్రమాలు..
వైసీపీ ఐదేళ్ళ పాలనలో నగరం మండలంలోని తాడవాకవారిపాలెం, ఈదుపల్లి, అల్లపర్రు, పూడివాడ, చిన్నమట్లపూడి గ్రామాల ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లు మంజూరయ్యాయి. అయితే మట్టిరోడ్లను నిర్మించి సీసీరోడ్లు వేసినట్లుగా ఎంబుక్‌లు సృష్టించి రూ.1.5 కోట్లు దోచేశారు. పూడివాడ(జాలాదిబుచ్చమ్మ), చిన్నమట్లపూడి(సంపతి తిరుపతమ్మ), సజ్జావారిపాలెం(పులివర్తి వెంకటేశ్వరరావు), తోటపల్లి (గోవతోటి తిరుపతిరావు), ఏలేటిపాలెం(కర్రా నాగరాజకుమారి), జిల్లేపల్లి(కోటేశ్వరరావు), వెనిగళ్ళవారిపాలెం(చిలకా సుబ్బారావు) బోగస్‌మస్టర్లు వేసి వచ్చిన నగదును కాజేశారు. ఓ వైసీపీ నాయకుడు, ఆయా పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఉపాధి సొమ్ములు దోచుకుతిన్నట్లు మండల పరిషత్ అధికారులు సోషల్ ఆడిట్‌లో తేల్చారు. ఈ క్రమంలో విచారణకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత రికార్డులతో ఫీల్డ్‌అసిస్టెంట్లు పరారయ్యారు.
Updated Date - Dec 20 , 2024 | 10:28 AM