వైద్య సిబ్బంది పనివేళలు పాటించాల్సిందే
ABN, Publish Date - Oct 11 , 2024 | 03:52 AM
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ షోకాజ్ నోటీసులు జారీ
సిబ్బంది హాజరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నతాధికారులకు అప్పగింత
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సచివాలయంలో సిబ్బంది హాజరుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు, ఇతర సిబ్బంది ఆలస్యంగా రావడం, నిర్ణీత సమయం కంటే ముందే వెళ్లిపోవడంపై తరచుగా వస్తున్న వార్తలు ఆవేదనకు గురి చేస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో లేకపోతే వారెంతో ఇబ్బందులకు గురవుతారని, కాబట్టి అందరూ పనివేళలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయన్న భయం సిబ్బందిలో లేకపోతే పరిస్థితిలో మార్పు రాదని మంత్రి అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాకపోయినా, అనుమతి లేకుండా గైర్హాజరయినా ఒక రోజు వేతనం కోత విధిస్తున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆస్పత్రుల్లో హాజరు పర్యవేక్షణ బాధ్యతను ఉన్నతాధికారులకు అప్పగించి, వీలైనంత త్వరలో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో వైద్య సిబ్బంది హాజరు నమోదుకు రూపొందించిన యాప్‌ను, దానిద్వారా సెప్టెంబరులో నమోదైన హాజరును మంత్రి పరిశీలించారు. ఈ యాప్‌ను మరింత మెరుగుపరిచి పనివేళల్ని ఉల్లంఘించే సిబ్బందికి ఆటోమెటిక్ షోకాజ్ జారీ చేసే విధంగా మార్పులు చేయాలని మంత్రి ఆదేశించారు.
Updated Date - Oct 11 , 2024 | 03:52 AM