Heavy Rains : 3 జిల్లాల్లో ఎడతెరపిలేని వాన
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:32 AM
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం నాటికి బలహీనపడనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
చిత్తూరులో పొంగిపొర్లిన జలాశయాలు, చెరువులు, కుంటలు
తిరుపతి జిల్లాలో పాఠశాలలకు సెలవు.. ఘాట్‌లో కొండచరియలు
నెల్లూరు జిల్లాలోనూ స్తంభించిన జనజీవనం.. 162 మిల్లీమీటర్ల వర్షం
నేడు బలహీనపడనున్న తీవ్ర అల్పపీడనం.. 2 రోజుల్లో అల్పపీడనం
రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం నాటికి బలహీనపడనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగలో 162.6 మి.మీ., పడమలలో 121.25, భీములవారిపాలెంలో 119.5, తొట్టెంబేడులో 94.75, బాలయ్యపల్లెలో 94.5, శ్రీకాళహస్తిలో 92.75, లాలాపేటలో 92.25, తడలో 90.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేలపైకి వరద నీరు చేరడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 12 మార్గాల్లో 43 బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. వాకాడు మండలం స్వర్ణముఖి బ్యారేజీలోకి భారీగా వరద చేరడంతో గేట్లు తెరిచి పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పిచ్చాటూరు మండలం ఆరణియార్, కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్లు నిండిపోయాయి. రేణిగుంట మండలం మల్లిమడుగు, చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాముల్లోకి వరద నీరు వస్తోంది. గురువారం పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించగా రెవెన్యూ సదస్సులు సైతం రద్దయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
తిరుమలలో భక్తులకు ఇబ్బందులు..
తిరుమలలో వర్షం కురవడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. గాలులు జతకావడంతో చలి విపరీతంగా పెరిగింది. చాలా మంది దర్శనం పూర్తికాగానే తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు గదులకే పరిమితయ్యారు. ఎడతెరిపి లేని వర్షానికి తిరుమల రెండవ ఘాట్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి విశ్రాంతి షెడ్ సమీపంలో ఓ భారీ బండరాయితోపాటు మట్టి, చిన్నపాటి రాళ్లు విరిగిపడ్డాయి. తిరుమలలోని జలాశయాల్లో భారీగా నీరు చేరింది. రానున్న 24 గంటల్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తమిళనాడు, శ్రీలంక దిశగా పయనించే క్రమంలో 17 నుంచి దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. 18న రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు.
వర్షాలపై అప్రమత్తం: హోంమంత్రి
భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలనిహోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు. కాగా మధ్య భారతంలో నెలకొన్న శీతలగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం పెరిగింది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - Dec 13 , 2024 | 03:33 AM