Share News

Nagababu: మాజీ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జనసేన నేత నాగబాబు

ABN , Publish Date - Sep 03 , 2024 | 08:46 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదలు మనిషి సృష్టించిన విపత్తు అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

Nagababu: మాజీ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జనసేన నేత నాగబాబు

అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడలో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదలు మనిషి సృష్టించిన విపత్తు అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణానది వరదల సందర్శనకు వచ్చి వరదల్ని మానవుడు సృష్టించిన విపత్తు అని సెలవిచ్చారని, ఆయనకు తాను కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు.


‘‘మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. 5 ఊర్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి. కాబట్టి వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు. దీన్ని అంటారు సార్... మనిషి సృష్టించిన విపత్తు అని. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెండ్ కాబట్టి ఒకసారి సహజ విపత్తుకి, మనుషుల సృష్టించిన విపత్తుకి మధ్య తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగబాబు సెటైర్లు వేశారు.


వీలైన సాయం చేస్తే బావుంటుంది

‘‘మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు మనిషి సృష్టించిన విపత్తు అని. వీలైతే ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను’’ అని నాగబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 08:48 PM