Jagananna Colony: జగనన్న కాలనీని అమ్మేశారు..
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:27 AM
Jagananna Colony: అది మోటకట్ల జగనన్న కాలనీ, మండల కేంద్రంలోని సంబేపల్లె వడ్లపల్లి రోడ్డు అనుకుని ఉంది. ఈ కాలనీలో 183 గృహ నిర్మాణాలకు లేఅవుట్లు చేయగా అందులో 120 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మిగతావి ఇన్ ఎలిజిబుల్ కింద పక్కన పెట్టేశారు. ఇదే అదునుగా చేసుకున్న...
అది మోటకట్ల జగనన్న కాలనీ, మండల కేంద్రంలోని సంబేపల్లె వడ్లపల్లి రోడ్డు అనుకుని ఉంది. ఈ కాలనీలో 183 గృహ నిర్మాణాలకు లేఅవుట్లు చేయగా అందులో 120 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మిగతావి ఇన్ ఎలిజిబుల్ కింద పక్కన పెట్టేశారు. ఇదే అదునుగా చేసుకున్న కొందరు రంగప్రవేశం చేసి ఒక్కొక్కడు నాలుగైదు స్థలాలు ఆక్రమించేశారు. వాటిని దళారుల ద్వారా అమ్మేసి నీకింత.. నాకింత అని పంచేసుకున్నారు. దీనిపై గతంలో జేసీ తమీమ్ ఆన్సారియా విచారణ చేపట్టినా.. ఎందుకనో ఆగిపోయింది. ఇదిలా ఉండగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థలాల్లో సగానికి పైగా భవనాలు పునాదులు, పిల్లర్ల దశలోనే ఉండడంతో డిసెంబరు నాటికి పూర్తి కావాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
సంబేపల్పై, నవంబరు 2: గత ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పట్టణంలో ఒక సెంటు, పల్లెల్లో ఒకటిన్నర సెంటుతో పట్టాలు పంపిణీ చేసింది. కానీ ఆ స్థలాలు కొండల్లో, గుట్టల్లో ఇవ్వడం. ఆ ఇచ్చిన వాటిల్లోనూ చాలా వరకు అనర్హులకు పట్టాలు ఇవ్వడంతో జగనన్న కాలనీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇక పరపతి, పలుకుబడి ఉన్నవారు అయితే ఒక్కొక్కరు నాలుగైదు స్థలాలు ఆక్రమించుకున్నారు. కొందరు ఆ స్థలాల్లో పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోగా, కొందరు ఆ స్థలాలను దళారుల ద్వారా అమ్మేసుకొని అందినకాడికి వెనకేసుకున్నారు. ఈ కోవకు చెందినవే మండలంలోని మోటకట్ల జగనన్న కాలనీ, ఈ కాలనీని మంచల కేంద్రంలోని సందేపల్లె పద్దపల్లి రోడ్డు అనుకుని లేఅవుట్లు వేశారు. ఈ కాలనీలో 188 గృహ నిర్మాణాలకు లేఅవుట్లు వేయగా అందులో 130 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మిగతా వాటిని ఇన్‌ఎలిజిబుల్ కింద పక్కన పెట్టేశారు. ఇదే అదునుగా భావించిన ఆక్రమణదారులు రెవెన్యూ సిబ్బంది సాయంతో స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క గునాదికి రెండు నుంచి మూడు లక్షలకు అమ్మేసి లక్షల్లో చేతులు మార్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనర్హులకు స్థలాలు కేటాయించారు..
ఈ కాలనీలో మోటకట్ల గ్రామ ప్రజలు కోసం, నిరుపేదలకు గృహాలు మంజూరు చేసేందుకు స్థలాలు కేటాయించారు. అయితే ఇక్కడ మోటకట్ల గ్రామస్తుల కన్నా ఇతర గ్రామస్తులే అధికంగా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్హులు కాకుండా, అనర్హులే ఇక్కడ స్థలాలు పొందారని పలువురు చెబుతున్నారు. బయట గ్రామస్తులకు అధికారులు ఒక్కొరికి నాలుగైదు స్థలాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదంటున్నారు.
జగన్ కాలనీలో పొజిషన్ సర్టిఫికెట్లు..
పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీల్లో స్థలాలకు అధికారులు పొజీషన్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఎవరికైనా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఆ స్థలం తమ ఆధీనంలో ఉండాలి. అక్కడ లబ్ధిదారుడు నివాసం ఉండాలి. అటువంటి వారికి మాత్రమే సర్టిఫికెట్ మంజూరు చేయాలి. కానీ, అధికారులు ఏం ఆశించి వారికి స్థలాలను కేటాయించారో, వారికి ఏ విధంగా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారో అధికారులే చెప్పాలి. డబ్బులు ఎరగా వేసి అధిక సంఖ్యలో సర్టిఫికెట్లు పొందినట్లు సమాచారం.
నేటికీ పూర్తికాని భవనాలు ఎన్నో..
ఆ కాలనీలో ఇంకా ఎన్నో గృహాలు వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మన ఇళ్లు మన గౌరవం పేరుతో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు చెబుతుంది. అయితే ఈ కాలనీలో చూస్తే డిసెంబరు లోపు పూర్తి చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా 50 శాతంపైన భవనాలు పూర్తి కావాల్సి ఉంది. పునాది, మౌలింగ్ దశలో వివిధ భవనాలు ఉన్నాయి. అర్హులైన వారికి మంజూరు చేసి ఉంటే ప్రతి ఒక్కరూ చెప్పిన సమయానికి గృహాల నిర్మాణం పూర్తిచేసి ఉండేవారని స్థానికులు అంటున్నారు. అనర్హులకు ఇవ్వడంతో గృహాలు పూర్తి చేయడంలేదని ఆరోపిస్తున్నారు.
గతంలో కాలనీ ఆక్రమణలపై పరిశీలన..
మోటకట్ల జగనన్న కాలనీలో అక్రమ ఇళ్లపై అప్పటి జాయింట్ కలెక్టర్ తమీమ్ ఆన్సారియా విచారణ చేపట్టారు. ఆక్రమణదాలపై ఆరా తీశారు. దీనిపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే రెవెన్యూ అధికారులు ఏం నివేదిక ఇచ్చారో ఏమో కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవు.
స్థలం కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలేదు..
నాకు ఇంటి స్థలం కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటానని ఎన్నిసార్లు అదికారులను అడిగినా ఇవ్వలేదు. సంబేపల్లి గ్రామస్తుడిని అయిన నాకే ఇవ్వలేదు. మండలంలోని ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న అనర్హులకు స్థలాలు కేటాయించారు. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి అర్హులైన వారిని గుర్తించాలి. ఆక్రమణలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకొని తగు న్యాయం చేయాలి.
-చంద్రశేఖర్ రెడ్డి, బొగ్గులవారిపల్లె
వీఆర్వోలతో కమిటీ వేశాం..
నేను కొత్తగా విధుల్లో చేరాను. ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఈ కాలనీపై వీఆర్వోలతో కమిటీ వేశాను. త్వరలో ప్రతి విషయంపై విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
- వెంకటేశులు, తహసీల్దారు
Also Read:
బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
నా లైఫ్‌లో చూస్తాననుకోలేదు: జడ్డూ
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Nov 02 , 2024 | 01:37 PM