అదానీ పవర్ కోసం గిరిజన చట్టాలు తుంగలోకి..!
ABN, Publish Date - Nov 25 , 2024 | 05:03 AM
మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుదుత్పత్తి చేసి నిల్వ చేసే ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా గత జగన్ సర్కార్ అదానీ పవర్ సంస్థలకు కట్టబెట్టింది.
జగన్ సర్కార్ నిర్వాకమిది
మన్యంలో స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు
అదానీకే మూడు ప్రాజెక్టులు కేటాయింపు
అనుంగు.. షిర్టీసాయికి మరొకటి..
2వేల ఎకరాలకు పైగా భూములు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు!
ఎకరం రూ.5 లక్షల చొప్పున అమ్మకానికి లేదా రూ.31వేల చొప్పున లీజుకు ఆమోదం
మన్యంలో బాక్సైట్ కోసం గతంలో సమతా
కేసులో సుప్రీంకోర్టు తీర్పు బేఖాతర్!
కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందో.. కొనసాగిస్తుందో..!
(రంపచోడవరం)
మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుదుత్పత్తి చేసి నిల్వ చేసే ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా గత జగన్ సర్కార్ అదానీ పవర్ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్తు సంస్థలకు ప్రాజెక్టులను కట్టబెడుతున్నాయి. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా జగన్ సర్కార్ 2022లో ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం 14,680 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నిల్వ చేసేందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాజెక్టులను వివిధ సంస్థలకు ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. వీటిలో నాలుగు ప్రాజెక్టులు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం గిరిజన జిల్లాల్లో ఉన్నాయి. గిరిజనేతర పేదలు ఇళ్లు కూడా కట్టుకోలేని విధంగా మన్యంలో చట్టాలు అమలవుతున్న తరుణంలో హైడ్రో ప్రాజెక్టులను మాత్రం చట్ట విరుద్ధంగా గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టడం వెనుక జగన్ సర్కార్ పెద్దలకు అయుక్తమైన లబ్ధి చేకూర్చిందన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. వీటి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలం ఎర్రవరంలో 1,200 మెగావాట్లతోను, అనంతగిరి మండలం పెదకోటలో 1,000 మెగావాట్లతోను, పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మండలంలోని కురుకుట్టిలో 1,200 మెగావాట్లతోను, కర్రివలసలో 1,000 మెగావాట్లతోను ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను మంజూరు చేసి, వీటిలో పెదకోట మినహా తక్కిన మూడు ప్రాజెక్టులను అదానీ పవర్ కంపెనీకి కట్టబెట్టింది. పెదకోట ప్రాజెక్టును హైదరాబాద్‌లోని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టారు. ఇది జగన్ బంధువుకు చెందినది కాగా.. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తంగా సుమారు 2వేల ఎకరాలకు పైగా భూమి కావాలి. వీటిలో 25 శాతం వరకు అటవీ భూములు ఉండగా, తక్కినవి పట్టా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములను ప్రజా ప్రయోజనం దృష్ట్యా భూ సేకరణ చేసేందుకు చట్టం ఉన్నా, వాటిని గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టేందుకు మాత్రం చట్టాలు అనుమతించవన్న సంగతి తెలిసీ కూడా ఈ కేటాయింపులు జరపడం వివాదమవుతోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుల మూలంగా నిరాశ్రయులయ్యే గిరిజన జాతులు, గిరిజన ఆవాసాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, ఉద్యమాలు సాగినా జగన్ సర్కారు పట్టనట్టే వ్యవహరించింది. గిరిజన ప్రాంత చట్టాల ప్రకారం గిరిజనులకు, గిరిజనులు సభ్యులుగా ఉన్న సహకార సంఘాలకు తప్ప ఇతరులకు గిరిజన ప్రాంతాల్లో ఏ రూపంలోనూ భూములను బదలాయించే అవకాశం లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈ చట్టాలను తుంగలో తొక్కింది.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాజెక్టులు చేపట్టాలన్నా ఆయా గ్రామసభల తీర్మానాలు, రాష్ట్ర గిరిజన సలహా మండలి ఆమోదం అవసరం. కానీ ఇవేమీ లేకుండానే ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇలాంటి వ్యవహారమే బాక్సైట్ తవ్వకాల విషయంలో చోటు చేసుకుంటే వివాదాస్పదంగా మారి సుప్రీంకోర్టు వరకు కేసు నడిచింది. సమతా కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో గిరిజన ప్రాంతాల్లో స్థిరాస్థులను గిరిజనేతరులెవ్వరికీ కట్టబెట్టే వీలులేదని, ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసినా గిరిజన హక్కులను చట్టాలను తుంగలో తొక్కి ఈ పవర్ ప్రాజెక్టులను ఆయా కంపెనీలకు కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ చట్ట విరుద్ధ పవర్ ప్రాజెక్టుల కేటాయింపులను రద్దు చేస్తుందా లేక కొనసాగిస్తుందో వేచి చూడాలి.
Updated Date - Nov 25 , 2024 | 05:03 AM