ఏటీఎంలను కొల్లగొట్టారు..
ABN, Publish Date - Sep 22 , 2024 | 11:54 PM
మండల కేంద్రంలోని కడప-చెన్నై జాతీయ రహదారి స్థానిక పోలీసుస్టేషనకు 30 అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. ముఖానికి
రెండు ఏటీఎంలలో భారీ చోరీ
రూ.42,38,700 అపహరణ
అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధనరాజు
కడప జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు ఏటీఎంలలో భారీ చోరీ జరిగింది. మాస్కులు ధరించిన దుండగులు ఏటీఎంలలోకి ప్రవేశించి సీసీ కెమెరాలకు స్ర్పే కొట్టి అనంతరం కట్టర్లతో మిషన్లను పగులగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. తొలుత కడప నగరంలో, అనంతరం ఒంటిమిట్టలో చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్ల మొత్తం 42,38,700 రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. దొంగతనం చేసిన అనంతరం కారులో రాజంపేట వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిమిట్టలోని ఏటీఎం మిషనను కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషనకు అతి సమీపంలోనే ఘటన జరగడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంటిమిట్ట/కడప క్రైం, సెప్టెంబరు 22 : మండల కేంద్రంలోని కడప-చెన్నై జాతీయ రహదారి స్థానిక పోలీసుస్టేషనకు 30 అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. ముఖానికి మంకీ క్యాపు పెట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగుడు కెమెరాలకు నలుపురంగును స్ర్పే చేసి దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనానికి పాల్పడిన ముఠా ముందుగా రెక్కీ నిర్వహించి ఏటీఎం ముందుభాగంలో కారును ఆపి అందులోని ఒక వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి మరో వ్యక్తి బయట కాపలాగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో డబ్బులు దోచుకెళ్లిన అనంతరం రాజంపేట వైపు వేగంగా కారులో వెళ్లినట్లు కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో 4.10 గంటలకు దొంగతనానికి పాల్పడితే 5 గంటల వరకు కనీసం పోలీసులకు సమాచారం రాకపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి సీఐ కృష్ణంరాజునాయక్, ఎస్‌ఐ శివప్రసాద్‌లు పరిశీలించి స్థానికంగా ఉన్న హైవే కెమెరాలను పరిశీలించారు. అనంతరం కడప నుంచి వచ్చిన క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలపడంతో వెంటనే మేనేజర్ జగదీ్‌షకుమార్ సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకుని పోలీసులకు వివరాలు తెలియజేశారు. అనంతరం రాజంపేట ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ మురళీనాయక్, చీఫ్ మేనేజర్ మల్లికార్జునరావు ఏటీఎంను పరిశీలించారు.
ఏటీఎంలో రూ.39 లక్షలు నగదు పెట్టిన సిబ్బంది
స్థానికంగా ఉన్న ఏటీఎంలో ఆదివారం సెలవు కావడంతో ఎస్‌బీఐ సిబ్బంది శనివారం సాయంత్రం 39 లక్షల రూపాయల నగదును ఏటీఎంలో భద్రపరిచారు. వారు పెట్టిన సమయం నుంచి రూ.2.80 లక్షలు నగదు వితడ్రా చేయడంతో మిగిలిన 36,19,400 రూపాయలు దోచుకెళ్లినట్లు ఎస్‌బీఐ మేనేజర్ జగదీశబాబు తెలిపారు.
పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు
స్థానిక పోలీసుస్టేషనకు 50 అడుగుల దూరంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరగడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు తమ పోలీసుస్టేషన పక్కనున్న వాటికే రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉండడం పోలీసులపై తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. మూడు నెలలుగా ఒంటమిట్ట బస్టాండుల్లో వరుస దుకాణాల్లో చోరీ జరగడం, వెంటనే ఏటీఎంలో చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
పోలీసుస్టేషన పక్కనే ఉన్నా ఏమి చేస్తున్నారు
స్థానిక పోలీసుస్టేషన పక్కనే ఏటీఎం ఉండడం, చోరీ జరగడం చూస్తుంటే ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతుందని సీఐ కృష్ణంరాజునాయక్‌పై ఎస్పీ హర్షవర్ధనరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏ మేరకు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఏటీఎం చోరీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పరిశీలించి స్థానిక పోలీసు అధికారులు, బ్యాంకు సిబ్బంది ద్వారా సమాచారాన్ని సేకరించారు. దుండగుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
దుండగుల కోసం సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ
ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన వెంటనే స్థానిక పోలీసు అఽధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలను పట్టుకునేందుకు విచారణ చేపట్టారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కడప, ఒంటిమిట్ట రెండు ఏటీఎంల్లో ఒక్కరే చోరీకి పాల్పడడం, కడపలో ఎరుపు రంగు దుస్తులతో ఏటీఎంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడడం, అదే వ్యక్తి ఒంటిమిట్ట ఏటీఎంలోకి మంకీ క్యాప్ ద్వారా ఏటీఎంలకు చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కడపలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వేసుకున్న బూట్లు, ఒంటిమిట్టలో చోరీకి పాల్పడిన వ్యక్తి బూట్లు ఒకేవిధంగా ఉండడంతో ఒకేవ్యక్తి రెండు ఏటీఎంల్లో చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
కడపలో రూ.6.19 లక్షల నగదు అపహరణ
మరోచోట ఏటీఎం చోరీ యత్నం
అలారం మోగడంతో పరారైన దొంగలు
్డకడప (క్రైం), సెప్టెంబరు 22 : కడప నగరంలో రెండు ఏటీఎంలలో చోరీకి యత్నించి ఓ చోట ఏటీఎం మిషనను పగులగొట్టి రూ.6,19,300 నగదు దోపిడీ చేశారు. శనివారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని కారులో దుండగులు కడప నగరంలోని విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్దకు వచ్చారు. అక్కడున్న ఎస్‌బీఐ ఏటీఎం మిషనలోకి ప్రవేశించి చోరీకి యత్నించారు. ముందుగా ఏటీఎం మిషన రూంలోని సీసీ కెమెరాలకు స్ర్పే కొట్టడంతో పాటు మాస్క్‌లు ధరించి యువకులు చోరీ యత్నానికి ప్రయత్నించారు. లోపల రూములోని డోరు ఓపెన చేసే ప్రయత్నం చేయగా అలారం మోగింది, దీంతో అక్కడ నుంచి పరారయ్యారు. తరువాత అక్కడ నుంచి ద్వారకానగర్‌లోని రైతు బజారు సమీపంలో ఎస్‌బీఐ ఏటీఎం మిషనకు చేరుకున్న దుండగులు తెల్లవారుజామున 2-3 గంటల వరకు ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు కట్టర్ల సహాయంతో మిషనను కట్ చేసి అందులో ఉంచిన రూ.6,19,300 నగదును అపహరించుకుని వెళ్లారు. చోరీలు జరిగిన ఏటీఎం మిషన్ల వద్దకు కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ, సీసీఎస్ సీఐ హేమకుమార్‌లు తమ సిబ్బందితో చేరుకున్నారు. సంఘటనలపై పోలీసులు తమ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం ఎస్పీ హర్షవర్ధనరాజు నేతృత్వంలో పోలీసు అధికారుల బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - Sep 22 , 2024 | 11:56 PM