Proddatur: పెద్దమ్మగుడి పేరుతో ఆక్రమణలు
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:26 AM
ప్రొద్దుటూరుమున్సిపాలిటీ స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొన్నేళ్లుగా కళ్లు మూసుకున్నట్టుగా వ్యవహరించడంతో అక్రమ కట్టడాలతో పాటు మున్సిపల్ స్థలాల ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపల్
షెడ్లు వేసి అద్దెలువసూళ్లు చేస్తున్న వైనం
ఆక్రమణలు తొగించాలని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది నోటీసులు
ప్రొద్దుటూరు, సెప్టెంబరు 18: ప్రొద్దుటూరుమున్సిపాలిటీ స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొన్నేళ్లుగా కళ్లు మూసుకున్నట్టుగా వ్యవహరించడంతో అక్రమ కట్టడాలతో పాటు మున్సిపల్ స్థలాల ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ ఇండోర్ స్టేడియానికి సంబంధించిన కొంత స్థలంలో కొన్నేళ్ల క్రితం కొందరు కుల సంఘాలను అడ్డుపెట్టుకుని ముందుచూపుతో పెద్దమ్మ విగ్రహం పెట్టి ఆక్రమించారు. మరి కొంతకాలానికి గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గదుల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. అప్పట్లోనే మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు గదుల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్‌లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. కుల సంఘం నేతగా ఉన్న నాయకుడు తాను ఆక్రమించిన స్థలాన్ని నిలుపుకోవడానికి వైసీపీలో చేరాడు. వెంటనే ఆగిపోయిన గదుల నిర్మాణం పూర్తి చేశాడు. అక్కడ పూలమండీకి, టెంకాయల అంగళ్లకు, పాల వ్యాపారాలకు ఇచ్చి అద్దెలు వసూలు చేయడం మొదలెట్టాడు. మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక చర్యలు
వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అక్రమ కట్టడాలపై, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ స్థలం ఆక్రమించి నిర్మించినషెడ్లనుతొలగించాలని అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు వాటిని లెక్కచేయలేదు. అంతేకాకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పి లోక్‌సత్తా నాయకుడు తెల్లాకుల మనోహర్ ఇంటిపైకి వెళ్లి ఆక్రమణ దారుడు బెదిరించాడు. దీనిపై బాధితుడు మనోహర్ ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. పెద్దమ్మ గుడికి పక్కన మున్సిపల్ స్థలంలో అక్రమంగా నిర్మించినషెడ్లు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అయితే మున్సిపల్ అధికారులు గుడి తొలగిస్తున్నారంటూ అక్కడే మూడు రోజులుగా కొందరు బైఠాయించి నిరసన చేపడుతున్నారు.
త్వరలో ఆక్రమణలు తొలగిస్తాం
- రఘునాధరెడ్డి, మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు
మున్సిపల్ హైస్కూలుకు సంబంధించిన స్థలం ఆక్రమించి గుడి నిర్మించారు. పక్కన షెడ్లు వేసుకుని అక్రమంగా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. ఆక్రమణలు తొలగించుకోవాలని నోటీసులు ఇచ్చాం. కానీ వారు స్పందించలేదు. ఫైనల్‌గా వాటిని తొలగించేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చాం. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లారు. వారికి రెండువారాల గడువు ఇచ్చారు. త్వరలో పోలీసు ప్రొటెక్షన్ తీసుకుని గుడిపక్కన వేసిన షెడ్లు తొలగిస్తాం.
Updated Date - Sep 19 , 2024 | 01:51 PM