ఉత్సాహం.. వరద

ABN, Publish Date - Sep 14 , 2024 | 11:22 PM

బాల్యంలో తన తండ్రి పెద్ద వరదారెడ్డి నేర్పిన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్నే 82 ఏళ్ల వయస్సులోనూ ఇంకా కొనసాగిస్తున్నారు. అందరూ పల్లెలు వొదిలి పట్టణాల్లో బంగ్లాలు కట్టుకుని జీవిస్తుంటేఆయన నేటికీ తన స్వగ్రామం కామనూరులోని రాధా నగర్‌లోనే నివాసం ఉంటున్నారు.

ఉత్సాహం.. వరద
పేపర్‌ చదవుతున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ఆరుసార్లు ఎమ్మెల్యే

అయినా జొన్నరొట్టే ఆహారం

పల్లె వదిలి పట్టణం రాని వైనం

తెల్లవారుజామున 3.45కే దినచర్య ప్రారంభం

రోజూ ధ్యానం, ఈత తప్పనిసరి

ఇదీ 82 ఏళ్ల ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి దినచర్య

సండే స్పెషల్‌

ఆయన జిల్లాలో ఇప్పుడున్న రాజకీయ నేతల్లో సీనియర్‌ మోస్టు నాయకుడు. వరుసగా ఐదుసార్లు ఎన్నికల్లో గెలిచి 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజకీయ దురంధరుడు. 1985 నుంచి 2009 వరకు తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఆయన అనంతరం వరుసగారెండుమార్లు శిష్యులు లింగారెడ్డి, రాచమల్లుచేతుల్లో ఓటమి పాలయ్యారు. మూడోసారి టికెట్టు దక్కక పోటీలో లేరు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే పదవికి దూరమైనా.. తిరిగి ఇప్పటిరాజకీయాల్లో సత్తా చాటి 82 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది మళ్లీ ప్రొద్దుటూరు ప్రజల ఆదర అభిమానాలు పొందారు. 82 ఏళ్ల వయసులో 28 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంగా ఉండే రాజకీయ ఉద్ధండుడు నంద్యాల వరదరాజులరెడ్డి జీవన శైలి, ఆయన బాల్యం నుంచి ఎదిగిన క్రమం గురించి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కఽథనం.

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 14: బాల్యంలో తన తండ్రి పెద్ద వరదారెడ్డి నేర్పిన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్నే 82 ఏళ్ల వయస్సులోనూ ఇంకా కొనసాగిస్తున్నారు. అందరూ పల్లెలు వొదిలి పట్టణాల్లో బంగ్లాలు కట్టుకుని జీవిస్తుంటేఆయన నేటికీ తన స్వగ్రామం కామనూరులోని రాధా నగర్‌లోనే నివాసం ఉంటున్నారు. పల్లెలోనే పచ్చటి వాతావరణం మధ్య ఆహ్లాదంగా కాలుష్యరహితంగాజీవనం సాగిస్తున్నారు.ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆయన జీవన శైలి చాలా సాదాసీదాగా సాగుతోంది. తన జీవన విధానం గురించి ఆంధ్రజ్యోతితో ఆయన ముచ్చటించారు.

రోజువారీ దినచర్య..

తెల్లవారుజామున 3.45 గంటలకునిద్రలేచి సత్సంగంలో కుటుంబసభ్యులతో పాటు పాల్గొంటా. సత్సంగంలో భాగంగానే చిన్నపాటివ్యాయామం, యోగా చేస్తా. అనంతరం 5.45 గంటలకు జమ్మలమడుగు రోడ్డులోగల రాయల్‌కౌంటీలోని స్విమ్మింగ్‌పూల్‌కు వెళతా. అక్కడ గంటకు పైగా స్విమ్మింగ్‌ చేస్తా. తిరిగి 7 గంటలకు పల్లెకు చేరుకుని పేపర్‌ చదువుతా. ఉదయాన్నే నన్ను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటా. వారికి అవసరమైన సహాయంపై వెంటనే స్పందిస్తా.

మా నాయన రాధాస్వామి భక్తుడు

ఆనాడు రేనాటి పల్లెల్లో సాయంత్రం అయితే పెనాలు పెట్టి రొట్ట్టెలు కాల్చేవాళ్లు. 50 ఏళ్ల కిందటే వరిధాన్యం వచ్చింది. అప్పటి వరకు జొన్న రాగి కొర్రలు మాత్రమే తినేవాళ్లం. మా తండ్రి పెద్ద వరదారెడ్డి స్వాతంత్య్రం రాకమునుపే దయాల్బాగ్‌లోనిరాఽధా స్వామి భక్తుడు. ఆయన రాధా స్వామి సత్సంగ సంప్రదాయం నుంచి మానవ జీవన విలువలను పాటించడం నేర్చుకున్నాడు. కష్టపడి సంపాదించే దాంట్లోనే బతకాలని, శక్తి వచ్చేదానికి మాత్రమే తిండితినాలని.. తినేదానికే బతకవద్దని సూచించిన జీవన మార్గం నేటికీ అనుసరిస్తున్నా. తక్కువ డబ్బుతో అలవాటు పడి బతికితే ఎక్కువ డబ్బు అవసరం ఉండదు. ఎక్కువ డబ్బుకు అలవాటు పడితే జీవితంలో అనేక తప్పులు చేయాల్సి వస్తుందనే జీవన సూత్రాన్ని నమ్ముతాను.

కుటుంబమంతా శాకాహారులే

చిన్నప్పటి నుంచి మా కుటుంబంలోని వారంతా శాకాహారులే. రాగి సంగటి, జొన్న సంగటి, కొర్ర బువ్వ, వరిబువ్వ, రొట్టెలు మా ఆహారం. మారిన కాల పరిస్థితుల్లో కూడా రుచులతో తినడం కంటే కూడా సంప్రదాయక వంటకాలంటేనే ఇష్టం. మా ఇంట్లో ఇప్పటికీ అవే వండుతారు.


బడి ఎగ్గొట్టి ఆటలకు వెళ్లేవాడిని

బాల్యంలో ప్రైమరీ స్కూలు కామనూరులో చదువుకున్నాను. ఆ తరువాత ప్రొద్దుటూరు అనిబిసెంట్‌ హైస్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివాను. ప్రొద్దుటూరులో నా చదువు కోసం మానాన్న వరదారెడ్డి ఇల్లు తీసి అందులో మా జేజిని నాకు తిండి వండి పెట్టడానికి పెట్టి చదివించాడు. కానీ నేను బడి ఎగ్గొట్టి పావురేన్ల ఆటలకు, పెన్నానదిలో ఈత కొట్టేందుకు, చెడుగుడు ఆడేందుకు వెళ్లేవాడిని. బడి ఇడిసే సమయానికి ఇంటికి వెళ్లేవాడిని. చదువంటే ఇష్టముండేది కాదు. అందువల్లే నేను ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ అయ్యాను. చదువు విలువ ఇప్పుడు తెలస్తోంది.

ఎంవీ రమణారెడ్డి నేనూ కలసి చదువుకున్నాం

బాల్యంలో నాకు మంచి మిత్రులు ఉండేవారు. వారిలో వంకదార వీరభద్రయ్య, ఖాజామోహిద్దీన్‌, అబ్దుల్‌ ఖాదర్‌ లతీఫ్‌, రంతూ, ఎరికలరెడ్డి, జింకా చెండ్రాయుడు ఉండేవారు. అలాగే డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి కూడా నాతోపాటు చదువుకున్నాడు. నేను బి సెక్షన్‌లో ఉంటే రమణా రెడ్డి సి సెక్షన్‌లో ఉండేవాడు. మున్సిపల్‌ హైస్కూల్లో నాకు బాగా ఇష్టమైన గురువు బోరెడ్డి సారు. ఆయన లెక్కల సారు. శిష్యుల పట్ల చాలా ప్రేమపూరితంగా ఉండేవారు.ఇంకాసేతురామయ్య, ముక్కమాళ్ల సుబ్బారావు, సూర్యప్రకాశరావు, వంకం సుబ్బన్న కిద్వాయ్‌, డేవిడ్‌ సార్‌ సుమిత్రమొసెస్‌లు కూడా మాకు గురువులుగా విద్యాబుద్ధులు నేర్పారు.

సాలు సొట్టపోతే సొలకాలతో కొట్టాడు

ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ కావడంతో మా తండ్రి వరదారెడ్డి చండశాసనుడుగా మారి మజ్జిగ కవ్వం చిలికే తాళ్లతో నన్ను తీవ్రంగా కొట్టాడు. చదువుకు పనికిరానని సేద్యానికి దింపాడు. సాలు దున్నేటప్పుడు సొట్టపోతే సోలకాలతో కొట్డాడు. నాలో భయాన్ని పొగొట్టేందుకు రాత్రి వేళ గొర్ల కాపలాకు పంపేవాడు. నన్ను ఊరికే ఉంచకుండా పనిచెప్పాలని చెప్పి రాఽధానగర్‌ నుంచి కామనూరు వరకు పంపి అక్కడ ఉండే వారిని పిలుచురమ్మని చెప్పేవాడు. దీంతో రాత్రి పూట సైతం ఆ దావల్లో కామనూరుకు వెళ్లి మనుషులను పిలుచుకు వచ్చేవాడిని. అలా నాలో ఏ పనినైనా చేయగలననే నమ్మకం కలిగించాడు మా నాయన. ఆ తరువాతే నాకువ్యవసాయం మీద మక్కువ పెరిగింది.. అలా కష్టపెట్టినాడు కాబట్టే నాకు జీవితం విలువ తెలిసింది. ఆ క్రమశిక్షణ కూడా నాకు మా తండ్రి నుంచి అలవడింది. ఆ తరువాత 1981 వరకు రెడ్డిపని చేశాను.

గుర్రపు స్వారీ..

నాకు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. ఖాజీపేట దగ్గర సూర్యనారాయణ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వెంట నేను గుర్రపు పందేలకు వెళ్లేవాడిని. ఆయన దగ్గర ఉన్న గుర్రాలు నాకు ఇచ్చేవాడు. నేను గుర్రపు స్వారీపల్లెలో చేసేవాడిని. ఒకసారి గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డాను. నాకెందుకో మొదటి నుంచి ఫ్యాను గాలి పడదు. అందుకే ఎప్పుడూ ఫ్యాను వేసుకోను. అయితే ఏసీలు వచ్చాక వాటికి మాత్రం అలవాటు పడ్డాను.

సమితి ప్రెసిడెంటుగా..

రాజకీయ జీవితంలో మొదట సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేశాను. అప్పుడు నా బాల్య మిత్రుడు కదా అని ఎంవి రమణారెడ్డిని సహాయం అడిగాను. ఆయన నీకే చేస్తానని చెప్పి రఘురామిరెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాడు. నాకు అప్పటి నుంచి రాజకీయాలపై పట్టుదల పెరిగింది. చిన్నప్పటి నుంచి పాణ్యం ఎర్రమునిరెడ్డి వర్గంలో ఉంటూ రాజకీయాల్లో తిరిగేవాడిని. అప్పటి నుంచి ఫ్యాక్షన్‌ రాజకీయాలతో భయాందోళనలో ఉన్న ప్రొద్దుటూరు ప్రజలకు భరోసా కల్పించడం కోసం రోజు ప్రొద్దుటూరుకు వెళ్లి వివిధ వర్గాలను కలిసి అండగా ఉండేవాడిని. హోమస్‌ పేటలో ఇల్లు తీసుకుని అక్కడే అన్నం వండుకోని తినేవాళ్లం. తిరిగి సాయంత్రం కల్లా కామనూరు చేరేవాడిని. 1983లో మొదటి సారి ఇండిపెండెంట్‌గా ఎంవీ రమణారెడ్డిపై ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాను. ఆ తరువాత 1985లో టీడీపీ టిక్కెట్‌పై రమణారెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచాను. అక్కడి నుంచి నేను ఇంక తిరిగి చూడలేదు. 1989 నుంచి 2004 వరకు కాంగ్రెస్‌ టిక్కెట్‌పై వరుసగా గెలిచాను.

పెద్దాయన పేరు ఇలా వచ్చింది

ఆ రోజుల్లో ప్యాంట్లు వేసుకోని ఉండే వారిని సార్‌ అని పిలిచేవారు. నేను మొదటి నుంచి గ్రామీణ వేషధారణలో గోసపంచ, చొక్కాతో ఉండే వాడిని. నా వేషధారణతో పాటు నా వ్యక్తిత్వం వల్ల కూడా నన్ను పెద్దాయనగా ప్రొద్దుటూరు ప్రజలు పిలుస్తూ వచ్చారు.


ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో..

ప్రొద్దుటూరులో నేను రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి నెహ్రూరోడ్డులో పార్టీ కార్యాలయం పెట్టాను. నా దినచర్య ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం. ఇది నలభై ఏళ్లుగా సాగుతా ఉంది. అసెంబ్లీ సమావేశాలుంటే తప్ప నేను ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడిని. నేను వరుసగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండటం వలన పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే ఆఫీసుగా మారింది.

పిల్లలను ఓబులమ్మ సగదీడింది

నలభై ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉండే నేను ఏనాడు ఇంట్లో పిల్లల పెంపకం విషయం పెద్దగా పట్టించుకోలేదు. వారికి ఫీజులు చెల్లించడం వారిని ప్రొద్దుటూరులో కాలేజీల వద్ద విడిచిపెట్టడం చేసేవాడిని. నా అర్ధాంగి ఓబులమ్మనే పిల్లలను బాగా సగదీడింది. ఇంటికి వచ్చేవారికి ఎప్పుడూ విసిగించుకోకుండా వండి పెట్టేది. ఏనాడు మా దాంపత్య జీవితంలో పొరపొచ్చాలు లేవు. ఆమెతో కలిసి ఇప్పటికీకుటుంబమంతా ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం.

నా రాజకీయ అండ వైఎస్సార్‌..

నేను రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాకు అండగా వుండేవాడు. ఆయన మరణించే వరకు ఆయనతో కలిసి చాలా కాలం ప్రయాణించాను.

Updated Date - Sep 14 , 2024 | 11:22 PM

Advertising
Advertising