ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:43 PM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
సబ్ కలెక్టరేట్ భవనం స్వాధీనం...
ప్రారంభం కాని మరమ్మతులు
నిధుల కోసం అధికారుల ఎదురుచూపు
11 మండలాల ఫైళ్ల రికవరీ ఎప్పుడో...?
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 21: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అప్పటి నుంచి పోలీసుల ఆధీనంలోనే ఉన్న సబ్‌కలెక్టరేట్ పరిపాలన భవనం ఇటీవల సబ్‌కలెక్టర్‌కు స్వాధీనం చేశారు. ఈ పరిపాలన భవనం పునఃప్రారంభం కావాలంటే ప్రభుత్వం నిధులు మంజూరు కావాలి. రెండు నెలల నుంచి సబ్‌కలెక్టరేట్ పరిపాలన అంతా పాత హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స భవనంలోని హాల్లోనే జరుగుతోంది. దీంతో పాటు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే, ఉన్నతాధికారుల సమావేశాలు కూడా ఈ భవనంలోనే జరుగుతున్నాయి.
మరమ్మతులకు మంజూరు కాని నిధులు
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో పరిపాలన కోసం కొత్త భవనం నిర్మించి, అందులో కార్పొరేట్ తరహాలో చాంబర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 వరకు వివిధ సెక్షన్లకు చాంబర్లు, వాటికి అనుసంధానంగా కంప్యూటర్లు, ఫైళ్లు భద్రపరిచేందుకు బీరువాలు, టేబుళ్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా సజావుగా జరిగిన పరిపాలన, జూలై 21వ తేదీ రాత్రి ఫైళ్ల దహనం ఘటన జరిగాక, పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. 10 రోజుల పాటు సబ్‌కలెక్టరేట్ ఉద్యోగులను విచారించిన పోలీసులు వారిని విధుల్లోకి అనుమతించారు. దీంతో ఇదే ఆవరణలోని హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స భవనంలో సాధారణ పరిపాలన ప్రారంభించారు. 50 రోజులుగా ఈ భవనంలోనే పరిపాలన, సమావేశాలు, గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న కంప్యూటర్లు, టేబుళ్లతోనే సర్దుకుని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సబ్‌కలెక్టరేట్‌లో కాలిపోయిన భవనాన్ని రెవెన్యూ అధికారులు పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎస్పీడీసీఎల్ అధికారులు వచ్చి కాలిపోయిన భవనం సామర్థ్యం, ఎలక్ర్టిక్ వైరింగ్, పెయింటింగ్, ఫర్నీచర్ మరమ్మతులకు ఎస్టిమేషన్‌లు వేసి సబ్‌కలెక్టర్‌కు నివేదించారు. దీనిపై సబ్‌కలెక్టర్ ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం ఎంత త్వరగా నిధులు విడుదల చేస్తే అంత వేగంగా సబ్ కలెక్టరేట్ పునఃప్రారంభం కావడంతో పాటు పరిపాలనలో వేగం పుంజుకోనుంది.
11 మండలాల్లో పైళ్ల రికవరీ ఎప్పుడో..?
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం ఘటనలో 2 వేలకు పైగా ముఖ్యమైన ఫైళ్లు దహనం కాగా 1500 ఫైళ్లు పాక్షికంగా దహనమైనట్లు సమాచారం. ఈ క్రమంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న ప్రాథమిక ఫైళ్లను అధికారులు రికవరీ చేసి, వాటి ఒరిజినల్స్‌ను సబ్‌కలెక్టరేట్ పంపాల్సి ఉంది. ఇందులో భాగంగా సబ్‌కలెక్టరేట్‌లోని 10 సెక్షన్లలో ఎస్టాబ్లి్‌షమెంట్, ల్యాండ్ కన్వర్షన్, క్రాకర్స్ లైసెన్స్, సివిల్ సప్లైస్, ఆర్‌వోఆర్ అప్పీల్, ప్రోటోకాల్, పేపర్ క్లిప్పింగ్స్, రిజిస్ట్రేషన్స్, వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్, ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలు, పరిష్కారం ఫైళ్లు, అలీనేషన్, 22-ఏ, డాటెడ్ ల్యాండ్, ల్యాండ్ సీలింగ్, హౌసింగ్, ఆర్‌టీఐ, అసైన్‌మెంట్ ల్యాండ్, ఎలక్షన్ విభాగాలతో పాటు డివిజినల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఫైళ్లు రికవరీ చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోగా, వీటిని సిద్ధం చేయడంలో ఉన్నతాధికారులు నిర్ధిష్ట ఆదేశాలు అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా మదనపల్లె ఆర్డీవోకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ గ్రూప్ సిమ్ నెంబర్ యాక్టివేషన్‌లో లేదు. ఈ సిమ్ యాక్టివేషన్ అయితే ప్రజాసమస్యలు, ఫిర్యాదులు నేరుగా సబ్‌కలెక్టర్‌కు అందించడంలో మార్గం సుగమం అవుతుంది.
బడ్జెట్ రిలీజ్ అవుతూనే పనులు ప్రారంభం
-మేఘస్వరూప్, సబ్ కలెక్టర్, మదనపల్లె
సబ్ కలెక్టరేట్ పరిపాలన భవనంలో కాలిపోయిన ఫైళ్లు, ఫర్నీచర్, బీరువాలు, పెయింటింగ్ తదితరాల మరమ్మతుల కోసం నివేదికలు పంపాము. బడ్జెట్ రిలీజ్ కాగానే మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం.
Updated Date - Sep 21 , 2024 | 11:43 PM