YS Jagan: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ జగన్ లేఖ.. ఎందుకంటే..
ABN, Publish Date - Jul 19 , 2024 | 08:03 AM
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు.. క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అపాయింట్‌మెంట్ (Appointment) కోరుతూ లేఖ (Letter) రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (AP State) నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని తమ దృష్టికి తీసుకు వస్తానంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారని, రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారని, అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయని, అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమను సమర్థించని, టీడీపీకి ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుందని, ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుందని జగన్ ఆరోపించారు. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారని, ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారని, వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారని, పట్టపగలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ ఘటనలు రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి నెలకొనేలా చేస్తున్నాయన్నారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు.
అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామస్థాయిలోనే ప్రజలకు అత్యంత చేరువగా సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలతో పాటు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లను సైతం టీడీపీ శ్రేణులు వదిలి పెట్టడం లేదని, చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని జగన్ అన్నారు. తాజాగా, గత బుధవారం, జూలై 17, 2024 రోజున పల్నాడు జిల్లా వినుకొండలో తమ పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారని, నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. పట్టపగలే నడిరోడ్డు మీద కత్తులతో స్వైరవిహారం చేస్తూ, మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సర్వసాధారణం అయిపోయాయని, వైసీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీకి చెందిన లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి దిగాయన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగిందని, చివరకు ఒక ఎంపీకి కూడా రక్షణ కల్పించలేని దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.
రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం అందరికీ అర్ధమవుతోందని, రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయని, అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం గత 40, 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదని, ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే 31 మంది హత్యకు గురయ్యారన్నారు. ఒక పథకం ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్న దుర్మార్గాలని అన్నారు.
రాష్ట్రంలో అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారని, ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్ పంపారని జగన్ పేర్కొన్నారు. ఏకంగా రాష్ట్రంలో ఒక మంత్రి రెడ్‌బుక్ పేరిట హోర్డింగులు పెట్టి, నేరుగా దాడులు చేయమని కేడర్‌కు చెప్పకనే చెప్పారని, వాటిని అడ్డుకోవద్దని అధికారులనూ నిర్దేశించారని అన్నారు. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని, మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని జగన్ అన్నారు. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉందని, అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. ఈ విషయమై మిమ్మల్ని కలిసి, వ్యక్తిగతంగా నివేదించడం కోసం.. మీకు అనుకూల సమయంలో అపాయింట్‌మెంట్ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇస్తే.. గత 40, 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను వ్యక్తిగతంగా వివరిస్తానని జగన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కవ్వింపులకు రెచ్చిపోవద్దు
విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 19 , 2024 | 12:55 PM