బెరైటీస్ తవ్వకాలపై పేచీ
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:46 PM
పులివెందుల ప్రాంతంలో ఉన్న బెరైటీస్ గనులపై ఇప్పటి వరకు వైసీపీ ఆధిపత్యం కొనసాగించింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీడీపీ ఆధిపత్యం కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. నియోజకవర్గంలో అనుమతి ఉన్నవి లేనివి దాదాపు 35 బెరైటీస్ గనులు ఉన్నాయి. ఇందులో లీజు ఉన్నవారు, లేనివారు వారి స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నారు.
టీడీపీ.. వైసీపీ మధ్య తీవ్రపోటీ
మాదంటే మాదని బలగాల మోహరింపు
ఆగిన తవ్వకాలు
పులివెందుల నియోజకవర్గంలో బెరైటీస్ గనులపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మా ప్రభుత్వం వచ్చింది గనులు మావని టీడీపీ అంటే... కాదు ఎప్పటి నుంచో ఇవి మావేనని వైసీపీ పట్టుబడుతోంది. ఇప్పటికే గనుల్లో తవ్వకాలు నిర్వహిస్తున్న వారిని టీడీపీ అడ్డుకొని ఆపేసింది. మాదంటే మాదని ఇరువర్గాలు బలగాల మోహరింపు వరకు వెళ్లింది. బెరైటీస్ తవ్వకాలపై ఇరుపార్టీలు తీవ్రంగా పేచీ పడుతున్నాయి.
(కడప-ఆంధ్రజ్యోతి): పులివెందుల ప్రాంతంలో ఉన్న బెరైటీస్ గనులపై ఇప్పటి వరకు వైసీపీ ఆధిపత్యం కొనసాగించింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీడీపీ ఆధిపత్యం కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. నియోజకవర్గంలో అనుమతి ఉన్నవి లేనివి దాదాపు 35 బెరైటీస్ గనులు ఉన్నాయి. ఇందులో లీజు ఉన్నవారు, లేనివారు వారి స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా వేముల మండలంలో బెరైటీస్ గనులు అధికంగా ఉన్నాయి. వేముల మండలంలో వైసీపీకి చెందిన ఓ నాయకుడు టిఫెన కంపెనీకిచెందిన బెరైటీస్ గనులను తన ఆధీనంలో ఉంచుకుని తవ్వకాలు సాగిస్తూ వచ్చారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకుడు, మరో ఇద్దరు వేముల మండల నాయకులు ఆ బెరైటీస్ గనులపై దృష్టి సారించారు. ప్రస్తుతం తవ్వకాలు సాగిస్తున్న వారందరిని ఆపేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీనితో లీజు ఉన్నవారు, లేనివారు ఎక్కడ పనులు అక్కడ ఆపేశారు. ఐదురోజుల క్రితం వేముల వైసీపీ నాయకుడు ఈ బెరైటీస్ గనులపై తమదే పెత్తనమంటూ పట్టుబట్టారు. దీనితో టీడీపీకి చెందిన నాయకులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వకాలు సాగించారు, మా ప్రభుత్వం వచ్చినపుడు మేము తవ్వకాలు సాగిస్తామని తెగేసి చెప్పారు. టిఫెన కంపెనీ తవ్వకాలకు అనుమతి ఇచ్చిందే గతంలో టీడీపీ ప్రభుత్వమేనని అవి తమ ఆధీనంలో ఉండాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇరుపార్టీలు వారివారి బలగాలను దాదాపు రెండువందల మందికి పైగా మోహరించి ఘర్షణకు దిగేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు కలుగజేసుకుని అందరినీ శాంతింపజేశారు.
ఇరుపార్టీల నాయకుల మధ్య బెరైటీస్ గనులు మావంటే మావనే పేచీ మాత్రం ఆగలేదు. ఎవరి స్థాయిలో వారు తవ్వకాల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. లీజు ఉన్న యజమానులను కూడా తవ్వకాలు చేయవద్దని చెప్పడంతో ఇదెక్కడి న్యాయమని వారు బహిరంగంగానే ఇరు పార్టీల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే అనుమతుల్లేని వాటిపై ఏదైనా పెత్తనం చెలాయించుకోవాలని అన్ని అనుమతులు ఉన్న తమపై పెత్తనం ఏమిటని వాపోతున్నారు. కేవలం డబ్బు ఆర్జనే ధ్యేయంగా అక్కడి నాయకులు బెరైటీస్ గనులపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని సాక్షాత్తు పులివెందుల ప్రజలే అంటున్నారు. వైసీపీకి చెందిన వేముల మండల నాయకుడు గనుల ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుంటే.. అధికారం కోల్పోయినా వారి పెత్తనం ఏమిటని టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా బెరైటీస్ తవ్వకాలతో పులివెందుల ప్రాంతంలో పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడ సాగుతున్న బెరైటీస్ తవ్వకాలతో కోట్లు కొల్లగొడుగుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.
Updated Date - Sep 15 , 2024 | 11:46 PM