క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:05 PM
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి
టీడీపీ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి టౌన్, సెప్టెంబరు 1: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో 2వ సౌత్‌జోన్ టార్గెట్ బాల్ చాంపియన్‌షి్‌ప 2024-25 పురుషులు, మహిళల విభాగంలో జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం క్రీడలతో పాటు విద్య, ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాయచోటి పట్టణంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న టార్గెట్ బాల్ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై స్నేహపూరిత వాతావరణంలో ఈ క్రీడలు విజయవంతంగా జరపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని వ్యాయామ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
సీనియర్ మహిళల టార్గెట్ బాల్ విభాగంలో తమిళనాడు జట్టు, పురుషుల టార్గెట్ బాల్ సౌత్‌జోన్ పోటీల విభాగంలో పుదుచ్చేరి జట్లు విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం, తెలంగాణ మూడవ స్థానం సాధించగా మహిళల విభాగంలో కర్ణాటక ద్వితీయ స్థానం, పుదుచ్చేరి మూడవ స్థానం సాధించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, పీడీలు రెడ్డెయ్య, నరసరాజు, ఆంజనేయులు, వరదరాజు, లక్ష్మినారాయణ, ఆనంద్, రామాంజనేయులు, కరుణాకర్, గోపాల్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 01 , 2024 | 11:05 PM